Advertisement
ఈటల రాజేందర్ వ్యాఖ్యలు.. రేవంత్ కౌంటర్లలో మొదలైన 25 కోట్ల వివాదం.. చినికి చినికి గాలివానలా మారింది. హస్తం నేతలు ఈటలను లక్ష్యంగా చేసుకుని ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. సీనియర్ నాయకుడు అయి ఉండి.. ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయడం తగదని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు వెరైటీగా స్పందిస్తున్నారు.
Advertisement
బీజేపీ నాయకురాలు విజయశాంతి ఈ వివాదంపై స్పందిస్తూ.. రేవంత్, ఈటలకు సూచనలు చేశారు. దేశంలోనే అత్యంత ధన ప్రభావిత ఎన్నికల కార్యాచరణ తెలంగాణలో కొనసాగుతోందని.. మన తెలంగాణ రాజకీయ కార్యకర్తలందరూ గత 9 సంవత్సరాలుగా చూస్తున్న వాస్తవమిదన్నారు. తమ్ముళ్లు రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్.. బీఆర్ఎస్ పై పోరాడే వాళ్లేనని అన్నారు. ఇద్దరూ ఒకరిపై మరొకరు కాకుండా… ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వంపై పోరాడటం అవసరమని సూచించారు.
Advertisement
తెలంగాణ పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న ఇద్దరూ దీనిపై ఆలోచించాలని కోరారు విజయశాంతి. నిరంతర తెలంగాణ ఉద్యమకారిణిగా ప్రజల తరఫున ఈ అభిప్రాయం చెప్పడం తన బాధ్యత అనిపించిందని చెప్పారు. మరోవైపు, కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైందని అంటున్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఇది ప్రజలకు బహిరంగంగా ఈటల రాజేందర్ చెబితే కాంగ్రెస్ నేతలకు అంత రోషమెందుకని ధ్వజమెత్తారు.
ఈటలపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు డీకే అరుణ. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు డబ్బులు అందాయని ప్రజలు అనుకుంటున్నారని ఈటల చేసిన వ్యాఖ్యలు వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దానికి గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు రేవంత్ రెడ్డి తీరుందని చురకలంటించారు. కేవలం మీడియాలో ఉండేందుకు డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. గల్లీలో, ఢిల్లీలో లేని పార్టీ కాంగ్రెస్ అని ఘాటుగా స్పందించారు.