Advertisement
భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆలేరు నియోజకవర్గంలో పర్యటించారు. ముందుగా పటేల్ గూడెం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.
Advertisement
స్థానిక అంబేద్కర్ సంఘాన్ని అభినందిస్తున్నానని చెప్పిన కోమటిరెడ్డి.. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండి, 30 ఏళ్లుగా తన వెంటే ఉన్న ఉపేందర్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ విగ్రహా ఏర్పాటుకు ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. తాను కూడా మీ మనిషినే.. ఎల్లప్పుడూ తన సహకారం ప్రజలకు ఉంటుందని తెలిపారు. అందరి సహకారంతో స్థానికంగా రోడ్లు బాగు చేసుకున్నామని.. పటేల్ గూడెం నుంచి శ్రీనివాసపురం వరకు బీటీ రోడ్డు వేసుకున్నామని అన్నారు.
Advertisement
తరచూ ప్రధానమంత్రిని, కేంద్రమంత్రిని కలిసి నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధి కోసం నిధులు అడుగుతున్నానని అన్నారు కోమటిరెడ్డి. జీడికల్ కు కేటాయించిన 60 కోట్లు కాకుండా.. రోడ్ల అభివృద్ధి కోసం పటేల్ గూడెం పరిసరాల్లోనే వంద కోట్లు ఖర్చు చేశామని వివరించారు.
అంబేద్కర్ విగ్రహావిష్కరణ తర్వాత.. స్థానికంగా ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కొనుగోలు వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలులో జాప్యం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని అన్నదాతలు ఆయనకు వివరించారు. వెంటనే, కలెక్టర్ కు ఫోన్ చేసి ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని ఎంపీ చెప్పడంతో.. దానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.