Advertisement
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. వారాహి విజయ యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం పర్యటిస్తున్నారు. జనసేనాని పెద అమిరంలోని నిర్మలదేవి ఫంక్షన్ హాల్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్ ఉపవాస దీక్షలో ఉండడంతో నీరసంతోనే స్వల్ప అస్వస్థతకు గురైనట్టు సమాచారం. మంగళవారం ఉదయం 11 గంటలకు జరగాల్సిన భీమవరం నేతలతో సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ తరుణంలో ఇతర పార్టీలకు చెందిన నేతలు పవన్ కళ్యాణ్ సమక్షంలో పలువురు జనసేనలో చేరనున్నారు.
Advertisement
వాస్తవానికి ఇవాళ షెడ్యూల్ ప్రకారం.. ఉదయం 11 గంటలకు భీమవరం నియోజకవర్గం నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. సాయంత్రం బహిరంగ సభను ఏర్పాటు చేశారు. కానీ స్వల్ప అస్వస్థతో ఉన్న పవన్ కళ్యాణ్ షెడ్యూల్ చిన్న మార్పులు చేశారు. నీరసంగా ఉండటంతో పవన్ విశ్రాంతి తీసుకున్నారని.. జన సైనికులు, అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు. మరోవైపు జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ 10 లక్షల సబ్ స్క్రైబర్స్ ను చేరుకుంది. పవన్ ఈ సందర్భంగా అభినందించారు. జనసేనకు మద్దతు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలిపారు. నర్సాపురంలో జరిగిన బహిరంగ సభలో కూడా పవన్ జగన్ సర్కార్ పై మండిపడ్డారు. సీఎం జగన్ ఎప్పుడూ బటన్ నొక్కుతానని గొప్పలు చెబుతారని ఆయన నొక్కకుండా వదిలేసిన బటన్లు ఎన్నో ఉన్నాయన్నారు. పోలవరం నిర్మాణం, రైతుల పంట నష్టపరిహారం, నిరుద్యోగ సమస్య, వలస వెళ్లే వారి కష్టాలు, దగ్దమైన దేవాలయాలు, అంతర్వేది రథం, దళితులపై అరాచకాలు, ఇలా సమస్యలు చాలానే ఉన్నాయన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ఎందుకు బటన్ నొక్కడం లేదని ప్రశ్నించారు.
Advertisement
జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. బటన్ నొక్కనని.. వ్యవస్థను కాపాడేందుకు ఓ ముఠా మేస్త్రీలా పని చేస్తానని పేర్కొన్నారు. విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీని మించిన హెల్త్ పాలసీని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఆడపిల్లల జోలికి రావాలంటే భయపడేలా కఠిన చట్టాలు తీసుకొస్తామని చెప్పారు. 2019 ఎన్నికల్లో తాను రెండు నియోజకవర్గాల్లో ఓడిపోవడంతో తన గుండె పగిలిందని పేర్కొన్నారు. జనసేన పార్టీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారని.. జాగ్రత్తగా ఉండాలని పార్టీ కేడర్ కి దిశా నిర్దేశం చేసారు. ప్రతీ ఒక్కరూ పార్టీ బలోపేతానికి ఫోకస్ చేయాలని సూచించారు. ఉభయగోదావరి జిల్లాలలో వైఎస్సార్ సీపీకి ఒక్క సీటు రాకూడదనే లక్ష్యంతో పని చేయాలన్నారు పవన్ కళ్యాణ్.
Also Read :
‘ప్రాజెక్ట్ K’ లో విలన్ కోసం… కమల్ హాసన్ కంటే ముందు ఆ హీరోని.. కానీ ప్రభాస్ వద్దు అన్నాడా..?