Advertisement
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. పార్టీ దూసుకువెళ్తున్న వేళ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. పార్టీ హైకమాండ్ రేవంత్ పై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా అమెరికా పర్యటనలో ఉచిత విద్యుత్ పైన చేసిన కామెంట్ బీఆర్ఎస్ కు అస్త్రంగా మారింది. దీనిని పార్టీ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. పార్టీ బలోపేతం అవుతున్న వేళ ఈ కామెంట్ తో ప్రజల్లో పలచన అవుతామనే అభిప్రాయం ఢిల్లీ నేతల్లో వ్యక్తం అవుతోంది. నిత్యం వివాదాస్సదంగా మారుతున్న రేవంత్ వ్యాఖ్యల తీరు పైన హైకమాండ్ వివరణ కోరినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీకి నష్టం చేస్తే ఏ స్థాయి వారినైనా ఉపేక్షించేది లేదని పార్టీ స్పష్టం చేస్తోంది.
Advertisement
తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికలకు సిద్ధం అవుతున్న వేళ బీఆర్ఎస్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతోంది. భట్టి పాదయాత్ర, ఖమ్మం సభతో పార్టీలో కొత్త జోష్ మొదలైంది. నేతలంతా ఒక్కటిగా పార్టీ కోసం పని చేస్తున్నారు. ఈ సమయంలో పార్టీని నడిపించాల్సిన టీపీసీసీ చీఫ్ రేవంత్ తీరు పార్టీకి నష్టదాయకంగా మారుతోంది. తన వ్యాఖ్యలతో పార్టీకి రేవంత్ డామేజ్ చేస్తున్నారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ లో ఎవరు సీఎం అనేది పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. ఎన్నికల వేళ కాంగ్రెస్ సీఎంగా సీతక్క అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీని పైన పార్టీ నాయకత్వం గుర్రుగా ఉంది. రేవంత్ ప్రకటనతో పార్టీలో భిన్నాభిప్రాయాలు రాకుండా వెంటనే సీనియర్లు సరిదిద్దే ప్రయత్నం చేసారు.
Advertisement
అమెరికా పర్యటనలోనే ఉచిత విద్యుత్ పైన రేవంత్ చేసిన వ్యాఖ్యలు బూమ్ రాంగ్ అయ్యాయి. పార్టీకి నష్టం చేసేవిలా ఉన్నాయని పార్టీ హైకమాండ్ ఆగ్రహంతో ఉంది. ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిరసనలకు దిగింది. దీంతో నేరుగా పార్టీ అధినాయకత్వమే రంగంలోకి దిగి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఉచిత విద్యుత్ కొనసాగింపు పైన హామీ ఇచ్చింది. గతంలోనూ రేవంత్ తీరు వివాదాస్పదమే. సీనియర్లకు వ్యతిరేకంగా రేవంత్ మద్దతు దారులు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టిన వ్యవహారం పైన నేతలు నేరుగా ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలకు ఫిర్యాదులు చేసారు. పార్టీ సీనియర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వారికి వ్యతిరేకంగా రేవంత్ తన మద్దతు దారులను ప్రోత్సహించటం వంటివి పార్టీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది.
వరుసగా ఇలాంటి చర్యలు, వ్యాఖ్యలతో పార్టీకి ఎన్నికల వేళ నష్టం కలిగేలా రేవంత్ వ్యవహరించటం పార్టీ నాయకత్వానికి రుచించటం లేదు. ఇప్పటికే తెలంగాణ వ్యవహారాల్లో స్వయంగా పార్టీ హైకమాండ్ ప్రతీ అంశాన్ని నేరుగా పర్యవేక్షిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో హైకమాండ్ రేవంత్ ను వివరణ కోరినట్లు సమాచారం. ఈ వ్యవహారం ఇప్పుడు టీ కాంగ్రెస్ లో ఆసక్తికర చర్చగా మారింది. కాంగ్రెస్ కు పరిస్థితులు అనుకూలంగా మారుతున్న వేళ సీనియర్లు అన్ని అంశాలు పక్కన పెట్టి సహకారం అందిస్తున్నారు. ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలతో పార్టీని ఆత్మరక్షణలోకి తీసుకెళ్తున్నారనే అభిప్రాయం బలంగా ఉంది. దీంతో వీటిని కంట్రోల్ చేసేందుకు రేవంత్ ను వివరణ కోరిన హైకమాండ్ తమ వైఖరిని స్పష్టం చేసే అవకాశం కనిపిస్తోంది.