Advertisement
తెలంగాణలో టీఎస్పీఎస్సీ గ్రూపు2 పరీక్ష ఆగస్టు 29, 30 తేదీలలో నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. అయితే ఈ గ్రూపు 2 పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు ఇప్పుడు కోరుతున్నారు. ఆగస్టు నెలలో గురుకుల బోర్డు పరీక్షలు ఉన్నందున రెండు పరీక్షలకు ఒకేసారి ప్రిపేర్ కాలేకపోతున్నామని.. మరో మూడు నెలలు గ్రూపు 2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు విన్నవిస్తున్నారు. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యాలయానికి 200 మంది అభ్యర్థులు చేరుకొని వినతి పత్రాన్ని అందజేశారు. ఆగస్టు 1 నుంచి 20వ తేదీ వరకు గురుకుల పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షలు ప్రకటించారు. గురుకులాల సిలబస్, గ్రూపు 2 సిలబస్ వేర్వేరుగా ఉన్నందున ఒకే అభ్యర్థి రెండు పరీక్షల సిలబస్ ని కవర్ చేయడం ఇబ్బందిగా ఉందని.. అభ్యర్థులు పేర్కొంటున్నారు. దీంతో గురుకులాల పరీక్షలు ముగిసిన తరువాత రెండు నెలలకి గ్రూపు 2 పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు.
Advertisement
Advertisement
మరోవైపు గ్రూపు 2 పేపర్ ఎకానమీ లో గత సిలబస్ కి 70 శాతం అదనంగా చేర్చారని.. ఇటీవలే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంతో మానసికంగా కృంగిపోయి దాదాపు మూడు నెలల వరకు చదవలేకపోయామని అభ్యర్థులు చెబుతున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని దాదాపు మూడు నెలల పాటు గ్రూపు 2 ఎగ్జామ్స్ ని వాయిదా వేయాలని టీఎస్పీఎస్సీ ని డిమాండ్ చేస్తున్నారు.
టీఎస్పీఎస్సీ గత ఏడాది 783 పోస్టులకు గ్రూపు2 నోటిఫికేషన్ వెలువడించింది. ఈ పోస్టులకు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కోపోస్టుకు సుమారు 705 మంది అభ్యర్థులు పోటీపడనున్నారు. ఆగస్టు 29, 30 తేదీలలో గ్రూపు 2 పరీక్ష నిర్వహించనున్నట్టు ఇప్పటికే టీఎస్ఎస్పీఎస్సీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆయా సెంటర్లకు సంబంధించి పాఠశాలలకు సెలవులు కూడా అధికారికంగా ప్రకటించింది. గ్రూపు 2 వాయిదా వేయాలనే డిమాండ్ ని టీఎస్ఫీఎస్సీ ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరీ.