Advertisement
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు బంధు పథకం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అయితే ఈ రైతుబంధు పథకం వల్ల కేవలం ధనవంతులకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుందని పలు మార్లు ప్రతిపక్ష నేతల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి రైతు బంధు పథకం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Advertisement
ముఖ్యంగా వందల ఎకరాలు ఉన్నటువంటి ధనవంతులకు కూడా రైతు బంధు పథకాన్ని వర్తింపజేయడం ఎందుకు అనే ప్రశ్నను సంధించారు. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కి కూడా రైతు బంధు పథకం ద్వారా లబ్ది పొందుతున్నారని.. నాగార్జునకు రైతుబంధు డబ్బులు అవసరమా అంటూ ప్రశ్నించారు. అమెరికాలో దాదాపు 30 ఏళ్లుగా పని చేసిన వ్యక్తి తెలంగాణలో 600 ఎకరాలను కలిగి ఉంటే.. అతని ఖాతాలో కూడా రైతుబంధు డబ్బులు పడుతున్నాయని.. అత్యంత సంపన్న వర్గాలకు రైతుబంధు డబ్బులు ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి అని ప్రశ్నించారు ఆకునూరి మురళి.
Advertisement
ఎకరానికి తెలంగాణ ప్రభుత్వం రూ.5వేలు సంవత్సరంలో రెండు సార్లు వారి ఖాతాలో వేస్తుందని.. వందల ఎకరాలున్న వారు లక్షలాది రూపాయలు లబ్ది పొందుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 60 లక్షల పైగా రైతులు, దాదాపు 22 లక్షలకు పైగా కౌలు రైతులు ఉన్నారని.. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. దిక్కుతోచని దయనీయ స్థితిలో ఉన్న రైతులకు మాత్రమే రైతుబంధు పథకాన్ని అందజేస్తే దానికి అర్థం ఉంటుందని ఆకునూరి మురళి స్పష్టం చేశారు.