Advertisement
పాలు పొంగడం అంటే పాలలో అధిక మోతాదులో ఉన్న నీళ్లు పొంగుతాయన్న విషయం తెలుసుకోవాలి. పాలు నిర్దిష్టమైన ఒకే పదార్థం కాదు. ఉప్పు లాగా, చక్కెర లాగా, క్లోరోఫారం లాగా, ఆక్సిజన్ లాగా అది ఒక శుద్ధమైన సంయోగ పదార్థమో, మూలకమో కాదు. పాలు ఓ మిశ్రమ పదార్థం. అలాగని ఉప్పు, నీళ్లలాగా, చక్కెర ద్రావణం లాగా, సోడా బాటిల్ లోని నీళ్లలాగా, సమ సంఘటన ద్రావణం కూడా కాదు. పాలను కొల్లాయిడ్ తరహా మిశ్రమ పదార్థం అంటారు.
Advertisement
అంటే అందులో ద్రావణి అయిన నీటితోపాటు, కరిగిన కొన్ని లవణాలు, చక్కెరలతో పాటు కరగకుండా పాలలో అన్ని వైపులకు విస్తరించి ఉన్న పెద్ద పెద్ద అణువులు ప్రోటీన్ పీలికలు, జీవ రసాయన బృహధనువులు ఉంటాయి. వీటికి తోడుగా చక్కెర గుళిక మీద చీమలు గుమిగూడినట్టు చిన్నపాటి నీటి బిందువుల చుట్టూ పాతుకుపోయిన తైల కణాలు, తైల బిందువుల చుట్టూ ఇదే విధంగా పేరుకున్న నీటి బిందువులు ఉండే సమూహాలు కూడా ఉంటాయి. ఇలాంటి సమూహాలను మైసెల్స్ అంటారు.
Advertisement
ఇలా ఎన్నో పదార్థాల సమ్మేళనమే పాలు. ఇలాంటి పాలను వేడి చేసినప్పుడు ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెల్సియస్ కు దాటే సమయంలో పాలలోని నీరు ద్రవ స్థితి నుంచి వాయుస్థితిగా మారే క్రమంలో బుడగలు ఏర్పడతాయి. అయితే పాలలో వివిధ పదార్థాలు ఉండటం వల్ల పాలలో ఉష్ణం అన్ని వైపులకు ఒకే విధంగా విస్తరించదు. క్రింద భాగాన అధిక వేడి పై భాగంలో తైలబిందువులు తేలడం వల్ల తక్కువ వేడి ఉంటుంది. కాబట్టి కిందనే మొదట ఏర్పడ్డ నీటి ఆవిరి బుడగలు తమపై ఉన్న పాల భాగాన్ని నెట్టుకుంటూ పైకి వెళతాయి. అందువల్లే పాలు పొంగుతాయి. కానీ నీటి విషయం అలా కాదు. నీరు శుద్ధమైన ద్రావని కాబట్టి ఉష్ణం అన్ని వైపులకు ఉష్ణ సంవహనం అనే పద్ధతిలో చేరడం వల్ల నీటిలో అన్ని భాగాల్లోనూ బుడగలు వస్తాయి. కాబట్టి పొంగకుండా పైనున్న బుడగలు గాలిలో కలుస్తుంటాయి.
Read also : బాలయ్య ‘సమరసింహా రెడ్డి’ సినిమాలో ఒక్క సీను బాగోలేదని వదిలేసిన హీరోయిన్ ఎవరంటే?