Advertisement
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఎంతోమంది ప్రముఖులు ఆయనతో కలిసి నడుస్తున్నారు. అలా శనివారం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు నటి పూనమ్ కౌర్. ఆమె యాత్రలో పాల్గొంది చేనేత కార్మికుల సమస్యలను రాహుల్ కు వివరించేదుకే అయినా.. వార్తల్లో నిలిచింది మాత్రం వేరే దాంట్లో. రాహుల్, పూనమ్ చేతులు పట్టుకుని నడిచిన ఫోటోలు నెట్టింట హల్ చల్ చేశాయి. దీనిపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.
Advertisement
ముఖ్యంగా, బీజేపీ, కాంగ్రెస్ మధ్య దీనిపై సోషల్ మీడియా వార్ జరుగుతోంది. బీజేపీ నేత ప్రీతి గాంధీ ఫోటోను షేర్ చేస్తూ.. తాత అడుగుజాడల్లో రాహుల్ నడుస్తున్నారని అన్నారు. అలాగే మరికొందరు నెహ్రూ, ఎడ్వినా మౌంట్ బాటన్ కు సంబంధించి అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కలగజేసుకుని కౌంటర్ దాడి మొదలుపెట్టారు.
Advertisement
కాంగ్రెస్ కార్యకర్తలు ప్రీతి వ్యాఖ్యలను ఖండిస్తూ పోస్టులు పెట్టారు. ప్రతిగా మహిళలతో ప్రధాని మోడీ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ‘ఈ దాడి రాహుల్ గాంధీ మీద కాదు. ఆ మహిళ వ్యక్తిత్వం మీద. ఈ దాడి బీజేపీ చేస్తోందని అంటున్నారు. సిగ్గుచేటు ప్రీతి గాంధీ’ అని కాంగ్రెస్ కు చెందిన రియా ట్వీట్ చేశారు.
మరోవైపు ప్రీతి గాంధీ పెట్టిన పోస్ట్ పై పూనం కౌర్ స్పందించారు. తాను జారి పడబోతే రాహుల్ గాంధీ తన చేతిని పట్టుకున్నారని తెలిపారు. ప్రీతి పెట్టిన పోస్ట్ చాలా అవమానకరంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ‘నారీశక్తి’ గురించి మాట్లాడటం మీకు గుర్తుందా అంటూ ప్రశ్నించారు. మహిళల పట్ల రాహుల్ గాంధీ ఆదరణ, గౌరవం, వైఖరి తన గుండెను తాకిందని.. చేనేత కార్మికుల సమస్యల గురించి విన్నందుకు ఆయనకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు పూనం కౌర్.