Advertisement
రెండు రోజుల క్రితం పాతబస్తీని నిర్లక్ష్యం చేస్తున్నారని బీఆర్ఎస్ సర్కార్ ను కార్నర్ చేశారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ. అసెంబ్లీలోనే నిలదీయడంతో కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. మిత్ర పక్షాలుగా ఉన్న పార్టీల నేతలు ఒక్కసారిగా వార్ కి దిగడంతో అందరూ షాకయ్యారు. ఆ వెంటనే అక్బరుద్దీన్ కాంగ్రెస్ నేతలను కలవడంతో అనేక వార్తలు వచ్చాయి. కాంగ్రెస్, ఎంఐఎం కలుస్తున్నాయా? అనే ప్రచారం సాగింది.
Advertisement
అయితే.. కేటీఆర్ తో వాగ్వాదం అంతా తూచ్ అనేశారు అక్బరుద్దీన్. మొన్న తిట్టిన ఆయనే.. ఇప్పుడు తెగ పొగిడేశారు. హైదరాబాద్ లో మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను మంత్రి కేటీఆర్.. సీఎస్ శాంతి కుమారితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఈనెల 11 నుంచి నెక్లెస్ రోడ్, ప్యారడైజ్, నిజాం కాలేజ్ ఏరియాల్లో ఇవి తిరగనున్నాయి. మొత్తం 6 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల కోసం హెచ్‌ఎండీఏ ఆర్డర్ ఇవ్వగా ప్రస్తుతం 3 బస్సులు అందుబాటులోకి వచ్చాయి.
Advertisement
ఇక హెచ్ఎండీఏ ఆఫీస్ లోనే హైదరాబాద్ సహా పాతబస్తీ అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా హైదరాబాద్ నలుమూలను అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ విధానమని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. పాతబస్తీ ప్రాంతంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను అధికారులు వివరించారు. జీహెచ్‌ఎంసీ చేపట్టిన ఎస్ఆర్డీపీ కార్యక్రమంలో ఇప్పటికే రహదారుల్ని బలోపేతం చేశామని.. ఫ్లై-ఓవర్లు, రోడ్ల నిర్మాణం పూర్తయిందని కేటీఆర్ చెప్పారు.
ట్రాఫిక్ జంక్షన్ లతో పాటు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, మూసీపై బ్రిడ్జిల నిర్మాణాన్ని వేగంగా కొనసాగిస్తున్నామని వివరించారు మంత్రి. పాతబస్తీ పరిధిలో తాగునీరు సరఫరా మెరుగుపడిందని.. ఇందుకోసం రూ.1200 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలిపారు. రెండున్నర లక్షలకు పైగా నల్లా కనెక్షన్ల ద్వారా ఉచిత తాగునీరు అందుతుందని చెప్పారు. 84 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పాతబస్తీలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ.. సంతోషం వ్యక్తం చేస్తూ కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. దీంతో మొన్న అసెంబ్లీలో ఫైరయిన ఆ అక్బరేనా..? ఇలా మాట్లాడుతోంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.