Advertisement
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటిదాకా నాలుగు విడతల్లో పలు నియోజకవర్గాల్లో పర్యటించిన ఆయన.. ఐదో విడత కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. భైంసా నుంచి కరీంనగర్ వరకు యాత్రకు ప్లాన్ చేశారు. మొత్తం 20 రోజుల పాటు 222 కిలోమీటర్ల మేర.. 5 జిల్లాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, 8 అసెంబ్లీ నియోజక వర్గాల్లో కొనసాగేలా అంతా సిద్ధం చేసుకున్నారు. కానీ, పోలీసులు చివరి నిమిషయంలో షాకిచ్చారు.
Advertisement
భైంసాలో బండి తలపెట్టిన పాదయాత్రకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. సున్నితమైన ప్రాంతంలో పాదయాత్రకు, బహిరంగ సభకు అనుమతి ఇవ్వమని తేల్చేశారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు యాత్రకు అనుమతి కోరారు. అయితే, శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్న దృష్ట్యా అనుమతి నిరాకరించినట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ సురేష్ తెలిపారు. దీనిపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిర్మల్ జిల్లా ఎస్పీ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు.
Advertisement
బండి సంజయ్ భైంసా వెళ్తుండగా కోరుట్ల దగ్గర వెంకటాపూర్ లో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి నుంచి ఆయన్ను కరీంనగర్ తీసుకెళ్లి వదిలేశారు. భైంసాలో సభ నిర్వహించి తీరుతామని బండి శపథం చేశారు. అదేమైన నిషేధిత ప్రాంతమా అని ప్రశ్నించారు. ఇదంతా ప్రభుత్వ కుట్రలో భాగమంటూ ఫైరయ్యారు. ఎవరెన్ని ఆంక్షలు పెట్టినా పాదయాత్ర ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే కోర్టుకు వెళ్తామన్నారు. చెప్పినట్టుగానే బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది.
తొలుత హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని భావించినా అది కుదరకపోవడంతో బీజేపీ తరఫు న్యాయవాది ఫస్ట్ కాల్ లిస్ట్ లో మెన్షన్ చేశారు. మరోవైపు బండి సంజయ్ ను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. కరీంనగర్ లోని ఆయన నివాసం నుంచి బయటకు రాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సంజయ్ నివాసం వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు.