Advertisement
ప్రతిపక్షాలపై కేంద్రం కక్షగట్టి దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందనే ఆరోపణలు తరచూ వినిస్తుంటాయి. దీనికి తగ్గట్టే ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో దర్యాప్తు సంస్థులు దూకుడుగా దాడులు చేస్తుంటాయి. దీంతో ఆరోపణలు జోరందుకోవడం జరుగుతుంటుంది. ఇప్పుడు ఓ మీడియా సంస్థపై ఐటీ దాడులు జరగడం హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.
Advertisement
కొన్ని వారాల క్రితమే మోడీపై.. “ఇండియా.. ది మోడీ క్వశ్చన్” పేరిట బీబీసీ ఒక డాక్యుమెంటరీని విడదల చేసింది. రెండు భాగాలుగా దీన్ని రూపొందించింది. 2002లో మోడీ సీఎంగా ఉన్న సమయంలో గుజరాత్ లో జరిగిన అల్లర్ల గురించి చెప్పడమే ఈ డాక్యుమెంటరీని ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే ఆదాయ పన్ను శాఖ అధికారులు.. బీబీసీపై దాడులు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రతిపక్షాలు కేంద్రాన్ని టార్గెట్ చేశాయి.
Advertisement
ఈ దాడులను కాంగ్రెస్, తృణమూల్ పార్టీలు ఖండించాయి. బీబీసీ ఆఫీసులపై ఐటీ రెయిడ్స్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అని ఆరోపించింది. తొలుత బీబీసీ డాక్యుమెంటరీ రిలీజైందని, ఆ తర్వాత దాన్ని బ్యాన్ చేశారని, ఇప్పుడు బీబీసీఐ ఐటీ దాడులు మొదలుపెట్టారని, ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అని పేర్కొంది. తృణమూల్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా తన ట్విట్టర్ లో దీనిపై రియాక్ట్ అయ్యారు. ఐడీ దాడి నిజమేనా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఇంత అకస్మాత్తుగా ఎలా ఈ దాడి చేశారని ప్రశ్నించారు. సెబీ ఆఫీస్ లో అదానీకి స్నాక్స్ ఇస్తూ.. బీబీసీ ఆఫీస్ లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.
ఇటు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. కొన్ని వారాల క్రితమే ప్రధాని మోడీపై బీబీసీలో డాక్యుమెంటరీ ప్రసారం అయ్యిందని, ఇప్పుడు భారత్ లోని బీబీసీ ఆఫీసులపై ఐటీ దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ, సీబీఐ, ఈడీ లాంటి ఏజెన్సీలు బీజేపీకి కీలు బొమ్మలా మారాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదానీ స్టాక్స్ పై నివేదిక ఇచ్చిన హిండెన్ బర్గ్ సంస్థపై ఐటీ దాడి చేయిస్తారా అని ప్రశ్నించారు. లేదంటే ఆ సంస్థనే టేకోవర్ చేసుకుంటారా అని విమర్శించారు కేటీఆర్.
మరోవైపు అధికారులు ఈ సోదాలపై వివరణ ఇచ్చారు. సర్వే మాత్రమే చేస్తున్నామని, సోదాలు చేయట్లేదని తెలిపారు. ట్రాన్స్ ఫర్ ప్రైసింగ్ నిబంధనలు, లాభాల మళ్లింపు వంటి అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఐటీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ దాడుల్లో కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొబైల్స్ ఫోన్స్, లాప్ ట్యాప్ లు, కంప్యూటర్ జప్తు చేసినట్లు వెల్లడించారు.