Advertisement
సాధారణంగా కపిల్ దేవ్, గవాస్కర్, రవిశాస్త్రి, సచిన్ టెండూల్కర్, గంగూలి, ద్రావిడ్, జహీర్ ఖాన్, ధోనీ వంటి ప్లేయర్ల పేర్లు లేకపోతే భారత క్రికెట్ లెజెండ్స్ అనే ప్రస్తావన వ్యర్థమనే చెప్పాలి. అదేవిధంగా పాకిస్తాన్ క్రికెట్ లెజెండ్స్ అంటే ఎవరు ఉన్నా లేకున్నా కానీ ఇమ్రాన్ ఖాన్ పేరు తప్పక ఉండి తీరాల్సిందనేది చాలా మందిలో ఉన్నటువంటి భావన. ఎందుకంటే పాకిస్తాన్ జట్టుని వరల్డ్ కప్ టోర్నీలో ప్రపంచ విజేతగా నిలిపిన ఘనత అతనొక్కడిదే. అలాంటి గ్రేట్ క్రికెటర్ ని పాక్ బోర్డు ఘోరంగా అవమానించింది. మరోవైపు నెటిజన్లు సైతం సగటు క్రికెట్ అభిమానులు పాకిస్తాన్ బోర్డుపై #ShameonPCB అంటూ మండిపడుతున్నారు. ఆగస్టు 15న తమ దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పీసీబీ తమ ట్విట్టర్ నుంచి ట్వీట్ చేసిన ఓ వీడియోనే దీనంతటికి మూలకారణం అని చెప్పుకోవాలి.
Advertisement
Advertisement
అసలు వీడియో ఎందుకు వివాదంగా మారిందంటే..’చరిత్ర అనేది ఒక్క రోజులోనే సృష్టించబడేది కాదు’ అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పాక్ తరుపున ఇప్పటివరకు ఆడిన, ఆడుతున్న ప్లేయర్ల విజయాలను ప్రస్తావిస్తూ కంప్లీషన్ వీడియోని పోస్ట్ చేసింది. ఆ వీడియోలో పాకిస్తాన్ మాజీ ప్రధాని, తోషిఖానా కేసులో జైల శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ని చూపించలేదు. దేశానికి క్రికెట్ వరల్డ్ కప్ అందించిన క్రికెట్ లెజెండ్ కు ఇది ఘోర అవమానం అని.. ఇలా చేయడం వెనుక పాకిస్తాన్ ప్రభుత్వం హస్తముందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు పీసీబీ మాజీ చైర్మన్ ఖలీద్ మహమూద్ కూడా ఆ వీడియోను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ విమర్శలు గుప్పించారు.