Advertisement
పాతబస్తీలో పాతుకుపోవాలని బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఎంఐఎం హవా నడుస్తున్నా.. ధైర్యంగా పోరాటం సాగిస్తోంది. ఈక్రమంలోనే మెట్రో విస్తరణ డిమాండ్ ను గట్టిగా వినిపిస్తోంది. ఎన్నోఏళ్లుగా పాతబస్తీ వాసులు ఎంజీబీఎస్ టూ ఫలక్ నుమా మెట్రో రైల్ నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నారు. మెట్రో మూడు కారిడార్లలో ఒకటైన బ్లూ కారిడార్ ను జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా ఫలక్ నుమా వరకు మొత్తం 14 కిలోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదించారు.
Advertisement
లైన్ అలైన్ మెంట్ విషయంలో స్థానికంగా కొన్ని అభ్యంతరాలు రావడంతో.. ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు 5.5 కిలో మీటర్ల మార్గం పనులు ఆగిపోయాయి. జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ నుంచి ఎంజీబీఎస్ వరకు పూర్తయిన 9.6 కిటోమీటర్ల మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. మిగిలిన 5.5 కిలో మీటర్ల మార్గంపై నీలినీడలు కమ్ముకున్నాయి. నిర్మాణ పనులు ఓ కొలిక్కి రావడం లేదు.
Advertisement
ఈ నేపథ్యంలో బీజేపీ పోరుబాట పట్టింది. హైదరాబాద్ పాతబస్తీకి మెట్రో రైల్ కావాలంటూ లాల్ దర్వాజ మొడ్ వద్ద నిరసన దీక్షకు ప్రయత్నించారు కమలనాథులు. అయితే.. అనుమతి లేదని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య వాగ్వివాదం జరిగింది. కొంతమంది బీజేపీ మహిళా నేతలను బలవంతంగా అరెస్ట్ చేసి, వ్యాన్ లో తీసుకెళ్లారు. పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో గౌలిపురా డివిజన్ బీజేపీ కార్పొరేటర్ ఆలే భాగ్యలక్ష్మీ చేతికి గాయమైంది.
ఈ అరెస్టులపై ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ఎంఐఎం ఫ్లోర్ లీడర్లు అసెంబ్లీలో మెట్రో కావాలంటారని.. సీఎం ఛాంబర్ కు వెళ్లి వద్దంటారని విమర్శించారు. ఓల్డ్ సిటీ డెవలప్ అయితే ఎంఐఎం పార్టీకి రాజకీయ భవిష్యత్ ఉండదనే.. అభివృద్ధి కానివ్వండం లేదని ఆరోపించారు. ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లింల కోసం పోరాడేది బీజేపీ ఒక్కటే అని చెప్పారు రాజాసింగ్. మొత్తంగా చూస్తే.. రానున్న రోజుల్లో ఈ ఆగిపోయిన మెట్రో రూట్ అంశంపై బీజేపీ మరింత దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.