Advertisement
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించి సీఎం కేసీఆర్ కీలక వీడియోలు విడుదల చేసి కేంద్రంపై విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టారు. వరుసబెట్టి ప్రెస్ మీట్లు పెట్టి సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓసారి ఎవరెవరు ఏమన్నారో చూద్దాం.
Advertisement
తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్
ప్రధాని మోడీపై కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆయన ప్రధాని కావాలని కలలుకంటున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా ప్రధానమంత్రి కావొచ్చు. మోడీ దేశాభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నారు. ప్రజల కోసం ఘర్ ఘర్ పానీ, ఉచిత విద్య, రైతులకు రైతుబీమాతో పాటు నగదు బదిలీ వంటి పథకాలను అమలుచేస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుతో బీజేపీకి సంబంధం లేదు. పట్టుబడ్డ ముగ్గురు నిందితులకు సంబంధాలు ఉన్నాయన్నది అబద్ధం. సొంత ఎమ్మెల్యేలపై కేసీఆర్ కు విశ్వాసం లేదు.
బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఫాంహౌస్ ఎపిసోడ్ అంతా పెద్ద డ్రామా. స్క్రిప్ట్ అంతా ఢిల్లీలోనే తయారైంది. డిల్లీ లిక్కర్ కేసును డైవర్ట్ చేయడానికే సీఎం ఈ డ్రామా చేస్తున్నారు. కేసీఆర్ ప్రెస్ మీట్ జబర్దస్త్ కామెడీ షో. ఫాంహౌస్ డ్రామాకు నిర్మాత, డైరెక్టర్, రైటర్ అన్నీ ఆయనే. నటించింది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మీడియా పార్ట్ నర్ పింక్ మీడియా.
Advertisement
కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి
కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలు. బ్రోకర్ల ద్వారా పార్టీలో ఎవరిని చేర్చుకోం. 100 కోట్లు కాదు 100 పైసలకు కూడా ఆ ఎమ్మెల్యేలను ఎవరూ కొనరు. ఫాంహౌజ్ ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. స్వామిజీలతో ప్రభుత్వం కూలిపోతుందా. ఎన్నో పార్టీల గొంతు నొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన కేసీఆర్.. ప్రజాస్వామ్యాన్ని బతికించండి అనడం సిగ్గుచేటు. తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది. ఎన్టీఆర్ పై చెప్పులు వేసిన ఘటనలో కేసీఆర్ ఉన్నారు. బయటివాళ్లతో బేరసారాలు చేసే కర్మ మాకు లేదు.
డీకే అరుణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు
మీ ఎమ్మెల్యేలను కొనడానికి వచ్చారో? ఇంకా దేనికి వచ్చారో ఇప్పటి వరకు మీకే క్లారిటీ లేదు. కానీ కేసీఆర్ కు మాత్రం చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే ఇదంతా చేయించింది ఆయనే కాబట్టి. ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే నవ్వాలో.. ఏడవాలో తెలియడం లేదు. ప్రెస్ మీట్ లో మిమ్మల్ని ఎవరూ ప్రశ్నించొద్దా? దళితులంటే చాలా గౌరవమన్నారు.. మరి కొప్పుల ఈశ్వర్ ను ఎందుకు సమావేశం నుంచి పక్కకు పంపించారు. అంతేకాకుండా.. దళిత వ్యక్తులు, ఎమ్మెల్యేలంటే కనీస గౌరవం లేదు.