Advertisement
ఎంపీ అరవింద్ ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండించింది బీజేపీ. పార్టీ నేతలు ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ సర్కార్, పోలీస్ శాఖపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓసారి ఎవరెవరు ఏమన్నారో చూద్దాం…
Advertisement
తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్
టీఆర్ఎస్ పార్టీ నేతలు కిరాయి గూండాల్లా వ్యవరిస్తున్నారు. పోలీసుల తప్పిదం క్లియర్ గా కనిపిస్తోంది. పోలీసులు టీఆర్ఎస్ నేతలకు అనుకూలంగా వ్యవరిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కూడా ఈటల రాజేందర్ పై దాడి చేశారు. బీజేపీపై టీఆర్ఎస్ దాడులను ప్రజలు గమనిస్తున్నారు. కేసీఆర్ ప్రజల్లో చులకనవుతున్నారు. ప్రజల్లో బీజేపీకి మద్దతు పెరుగుతోందని ఓర్వలేక ఈ దాడులు చేస్తున్నారు.
కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి
ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకోవాలనే కోరిక తమకు లేదు. భయపెట్టి, బతిమిలాడి పార్టీలో చేర్చుకునే అవసరం మాకు లేదు. ముఖ్యంగా తాయిలాలు ఇచ్చి బీజేపీలో చేర్చుకునే అవసరం లేదు. మోడీని ఢీకొంటున్నట్లు ఇతరులు అనుకోవాలని ఈ చర్యలకు పాల్పడుతున్నారు. ఊరికొక ఎమ్మెల్యే, మంత్రి కూర్చుంటేనే మునుగోడులో గెలిచారు. పోలీసులు, మజ్లిస్ ను అడ్డుపెట్టుకుని మాపై దాడులు చేస్తున్నారు. టీఆర్ఎస్ దాడులకు తెలంగాణ ప్రజలు సమాధానం చెప్తారు.
Advertisement
ప్రహ్లాద్ జోషి, కేంద్రమంత్రి
రాష్ట్రంలో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న బీజేపీ.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించడం హాస్యాస్పదం. బీజేపీలోకి కేటీఆర్, కవిత ఎవరు వచ్చినా సాదరంగా ఆహ్వానిస్తాం. తెలంగాణలో బీజేపీ ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేకే మా నేతల ఇళ్లపై కేసీఆర్ ప్రభుత్వం దాడులకు పాల్పడుతోంది. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది. సీఎం అబద్ధాలకు అడ్డులేకుండా పోతోంది.
బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
గడీల గూండాల దాడులకు, తోక ఊపులకు భయపడబోం. బీజేపీ సహనాన్ని చేతగానితనం అనుకోవద్దు. కమలం కార్యకర్తలు బరిలోకి దిగితే తట్టుకోలేరు. ప్రజలే టీఆర్ఎస్ గూండాలకు కర్రుకాల్చి వాతపెట్టే రోజు దగ్గర్లోనే ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే దమ్ములేక భౌతిక దాడులకు దిగి రౌడీయిజం చేస్తారా? అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ములేని దద్దమ్మలు దాడులతో ప్రశ్నించే గొంతును నొక్కాలనుకుంటున్నారు.
అరవింద్ కుటుంబానికి టీఆర్ఎస్ నుంచి ప్రాణహాని ఉంది. ఆయన ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగడం దేనికి సంకేతం. ఎంపీ నివాసంపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేయడం సిగ్గుచేటు. బీజేపీ కార్యకర్తలు కేవలం ధర్నాకు సిద్ధమైతేనే అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసే పోలీసులు మరి ఇప్పుడేం కేసులు బుక్ చేస్తారో చెప్పాలి. ఈ దాడికి ప్రధాన కారకురాలైన ఎమ్మెల్సీ కవితపై కూడా పోలీసులు కేసు నమోదు చేయాలి.