Advertisement
ఎమ్మెల్యే రాజాసింగ్ ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వచ్చారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై పోలీసులు పీడీ యాక్టు ప్రయోగించారు. అయితే.. హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పీడీ యాక్టు కేసు ఎత్తివేసింది.
Advertisement
అసలేం జరిగిందంటే…
స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించడానికి వీల్లేదని రాజాసింగ్ హెచ్చరించారు. హిందూ దేవుళ్లను కించపరిచిన అతని ప్రోగ్రాంకి ప్రభుత్వం అనుమతిస్తే దాడులకు పాల్పడతామని వార్నింగ్ ఇచ్చారు. అయితే, ప్రభుత్వం అవేవీ పట్టించుకోకుండా మునావర్ షో కు ఓకే చెప్పింది. భారీ భద్రతను కల్పించింది. పెద్ద ఎత్తున పోలీస్ భద్రతను ఏర్పాటు చేసింది. ఆందోళనలకు దిగిన బీజేపీ, ఇతర హిందూ సంస్థల నాయకులను అరెస్ట్ చేయించింది.
Advertisement
ముందే హెచ్చరించినా మునావర్ షో కు ప్రభుత్వం ఓకే చెప్పడాన్ని నిరసిస్తూ రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేశారు. అందులో మునావర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే, దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రాజాసింగ్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఈ అరెస్ట్ కరెక్ట్ గా లేదని బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. కానీ, తర్వాత ఇతర కేసుల్లో రాజాసింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపారు.
ఇది అక్రమ కేసు అని ఆయన భార్య గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని ప్రభుత్వ ఒత్తిడితో అనేక కేసులు బుక్ చేసి, తన భర్తను నిర్బంధించారని ఆరోపించారు. తన భర్తకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పలు వాయిదాల అనంతరం రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేసింది.
హైకోర్టు షరతుల నేపథ్యంలో ఎలాంటి ర్యాలీ లేకుండానే రాజా సింగ్ ఇంటికి వెళ్లిపోయారు. పీడీ యాక్టును ఎత్తివేయడంతో పాటు బెయిల్ మంజూరు చేయడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ధర్మం గెలిచిందని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా శ్రీరాముడు విగ్రహంతో దిగిన ఫోటోను ట్వీట్ చేశారు రాజాసింగ్. ఇటు రాజాసింగ్ బయటకు రావడంతో బీజేపీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు.