Advertisement
ప్రజా సంగ్రామ యాత్రలో ఊరూరా తిరుగుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఓవైపు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. అండగా ఉంటామని భరోసానిస్తూ.. ఇంకోవైపు కేసీఆర్ పాలనపై విరుచుకుపడుతున్నారు. ఆరోరోజు యాత్ర గుండ్లపల్లి క్రాస్ రోడ్డు నుంచి సిర్గాపూర్ వరకు ప్లాన్ చేశారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని దిల్వార్పూర్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలోని దివ్యాంగులతో ముచ్చటించారు బండి. అనంతరం దివ్యాంగులకు బ్యాగులు, పుస్తకాలను పంపిణీ చేశారు.
Advertisement
దిల్వార్పూర్ గ్రామంలోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుతో కలిసి కలిసి పూజలు చేశారు. తెలంగాణ ప్రజలారా.. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పెద్దగా ఆశలు లేవు.. ధర్మం కోసం మాత్రమే పనిచేస్తారని.. మరణిస్తే తమ మీద కాషాయ జెండా లేదా కమలం జెండా మాత్రమే కప్పాలని కోరుకుంటామని ఉద్వేగభరితంగా మాట్లాడారు.
Advertisement
రాష్ట్రంలోని బెల్ట్ షాపులన్నీ కేసీఆర్ దుకాణాలేనని ఆరోపించారు బండి. వేరే దేశాల్లో పెట్టుబడులు పెట్టి లిక్కర్, డ్రగ్స్, క్యాసినో దందాలు నిర్వహిస్తున్న ఘనత ఆయన కూతురిదేనని విమర్శించారు. రైతుబంధు పేరుతో రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ధరణి పోర్టల్ లోపాల పుట్ట అని, రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. నిరుపేదల భూములను కాజేసేందుకే ధరణిని తీసుకువచ్చారని.. బీజేపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ మరింత మెరుగ్గా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేవు కానీ బెల్ట్ షాపులు మాత్రం కచ్చితంగా ఉంటున్నాయని ప్రభుత్వంపై ఫైరయ్యారు.
కేసీఆర్ బిడ్డకు నోటీసులొస్తే.. తెలంగాణ ఎందుకు ధర్నా చేయాలని నిలదీశారు సంజయ్. కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు. 3 నెలలుగా ఆసరా ఫించన్లు ఆగిపోయాయని, ఇప్పటికే 2 నెలల ఫించన్ ను కట్ చేశారని విమర్శించారు. పేదలకు అరిగోస పెడుతున్న కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని విమర్శలు చేశారు. ఫాంహౌస్ లో సాగు చేసిన కేసీఆర్ కోటీశ్వరుడు ఎట్లా అయ్యారని, ఆరుగాలం పండించిన రైతులు బికారీలు ఎందుకు అవుతున్నారని నిలదీశారు బండి సంజయ్.