Advertisement
ప్రజాసంగ్రామ యాత్రపై ప్రధాని మోడీ ఆరా తీయడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అదే ఊపులో ఐదో విడత పాదయాత్రను ముగించారు. కరీంనగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సొంత నియోజకవర్గం కావడంతో ఎక్కడచూసినా బండి నినాదాలు మార్మోగాయి. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ కేసీఆర్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Advertisement
బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ తప్పదన్నారు నడ్డా. సాలు దొర.. సెలవు దొర నినాదాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్తామని చెప్పారు. కేసీఆర్ తెలంగాణను అప్పులకుప్పగా మార్చేశారని దుయ్యబట్టారు. దోచుకోవడం, దాచుకోవడమే కేసీఆర్ సర్కార్ పనిగా పెట్టుకుందని విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తామన్న కేసీఆర్ హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. ఆయనకు కుటుంబ పాలన తప్ప ప్రజాసంక్షేమం పట్టదన్నారు. బీజేపీ మాత్రమే కేసీఆర్ ను గద్దె ధీమా వ్యక్తం చేశారు నడ్డా. కేసీఆర్ పాలనంతా అవినీతి, అక్రమాలేనని ఆరోపించారు.
Advertisement
ఇక బండి సంజయ్ మాట్లాడుతూ… తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసిపోయారని విమర్శించారు. దోచుకో, దాచుకో అనే పాలసీతో పరిపాలిస్తున్నారని దుయ్యబట్టారు. ఇద్దరు సీఎంలు కలిసి సమైక్యాంధ్ర అంటూ డ్రామాలు ఆడుతున్నారని ఫైరయ్యారు. కేసీఆర్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చేశారని.. రైతుబంధు, దళితబంధు ఇవ్వడం లేదన్నారు. ధరణి పోర్టల్ పేరుతో భూములు దోచుకుంటున్నారని.. బీఆర్‌ఎస్ అంటేనే బందిపోట్ల రాష్ట్ర సమితి అని విమర్శించారు. ప్రధాని మోడీని ఎదుర్కొనే దమ్ములేకే గుంటనక్కలు ఏకమవుతున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సభలో ప్రసంగిస్తూ భావోద్వేగానికి లోనయి కన్నీళ్లు పెట్టుకున్నారు సంజయ్. కరీంనగర్ గడ్డ.. బీజేపీ అడ్డా అని స్పష్టం చేశారు. కరీంనగర్ గడ్డ గర్జిస్తే కొందరికి వెన్నులో వణుకు పుట్టాలన్నారు. ప్రజలు, ధర్మం కోసమే తమ పోరాటమని.. అవినీతి, కుటుంబ పాలనను అంతమొందిస్తామని ప్రకటించారు. కరీంనగర్ స్ఫూర్తితో గడీల పాలనపై పోరాడుదామని.. తెలంగాణను కాషాయపు జెండాతో పవిత్రం చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణను తీసేశారంటూ విమర్శించారు. దీంతో తెలంగాణతో కేసీఆర్ బంధం తొలగించుకున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పేరుతో దేశాన్ని దోచుకుందామని చూస్తున్నారని ఆరోపించారు. దందాలు, కబ్జాల పేరుతో లక్షల కోట్ల రూపాయలు దండుకుంటున్నారని విమర్శలు చేశారు సంజయ్. కేసీఆర్ గడీలను కూల్చేస్తామని స్పష్టం చేశారు.