Advertisement
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో కార్నర్ మీటింగులకు శ్రీకారం చుట్టింది. అయితే.. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. సచివాలయం డోమ్ లు కూల్చేస్తామని అన్నారాయన. ఇటీవల ప్రగతి భవన్ ను కూల్చేయాలని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇప్పుడు బండి చేసిన సచివాలయం కామెంట్స్ పై పెద్ద చర్చ జరుగుతోంది. తాము అధికారంలోకి వచ్చాక తప్పకుండా సెక్రటేరియట్ పైన ఉన్న డోమ్ లను కూల్చివేస్తామని.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా మారుస్తామని తెలిపారు సంజయ్.
Advertisement
బండి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘గుమ్మటాలు అనేవి ఇంజనీరింగ్ అద్భుతాలు.. అది ఒక ఆకృతి. సుప్రీంకోర్టుకు కూడా డోమ్ ఉంది. ఎర్రకోటకు కూడా ఉంది. అనేక శాసనసభ భవనాలకు ఉన్నాయి. వాటిని కూడా కూలుస్తారా?’’ అని ప్రశ్నించారు. బండి సంజయ్ లాంటి వ్యక్తిని అధ్యక్షుడిగా ఎలా నియమించారో బీజేపీ అధిష్టానం ఆలోచించాలని ఎద్దేవ చేశారు. బండి సంజయ్ అజ్ఞానానికి సిగ్గుపడాలన్నారు నిరంజన్ రెడ్డి.
Advertisement
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్, అరూరి రమేష్ మాట్లాడారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని రమేష్ సూచించారు. పిచ్చోడిలా, సైకో లెక్క మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రగతి భవన్ పగులగొడుత అని ఇంకో పిచ్చోడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ది కోసం టీవీల్లో కవరేజ్ కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
మాయమాటలు చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి బండి సంజయ్, రేవంత్ రెడ్డి పబ్బం గడుపు కోవాలనుకుంటున్నారని ఫైరయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అడ్రెస్ లేదని.. ఫ్రస్ట్రేషన్ లో ఆపార్టీ నేతలు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు. బండి, రేవంత్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని.. ఇద్దరిని ఎర్రగడ్డలో జాయిన్ చేయాలని సూచించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇద్దరు ప్రజలకు బేషరత్ గా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.