Advertisement
లిక్కర్ స్కాం కు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవి ఈడీ విచారణకు హాజరయ్యారు. అయితే.. అనూహ్యంగా బీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్ కు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగడం హాట్ టాపిక్ గా మారింది. ఇది ముమ్మాటికీ డైవర్షన్ పాలిటిక్స్ అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Advertisement
బండి సంజయ్ ఏమన్నారు?
రెండు రోజుల క్రితం కవిత జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు బండి. కేసీఆర్ కుటుంబం నుంచి ఒక వికెట్ పడుతుందని.. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే అంటూ మాట్లాడారు. చట్టసభల్లో మహిళా బిల్లుపై దీక్ష చేసే అర్హత కవితకు లేదని మండిపడ్డారు. తప్పు చేసిన వారిని అరెస్ట్ చెయ్యకుండా ముద్దు పెట్టుకుంటారా అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం
కవిత ఈడీ ఆఫీస్ కు అలా బయలుదేరారో లేదో.. బీఆర్ఎస్ శ్రేణులు బండిని టార్గెట్ చేస్తూ నిరసనలు మొదలుపెట్టారు. ముందుగా ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. బండి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆ వెంటనే బీఆర్ఎస్ మహిళా నేతలు మీడియా ముందుకొచ్చారు. మంత్రులు సబిత, సత్యవతి, ఎంపీ కవిత.. బండిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ నుంచి ఆయన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బండికి అక్కాచెల్లెళ్లు లేరా అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
Advertisement
తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు, ఫిర్యాదులు
ఇటు తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలకు దిగారు నేతలు. బండి దిష్టిబొమ్మలను దహనం చేసి.. పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. వెంటనే సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
మహిళా కమిషన్ ఆగ్రహం
మరోవైపు బండి వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించింది మహిళా కమిషన్. దీనిపై సమాధానం ఇవ్వాలని సంజయ్ కి నోటీసులు పంపింది. అయితే.. ఇవి తనకింకా అందలేదని.. కచ్చితంగా సమాధానం చెప్తానని అన్నారు ఆయన.
బండి వ్యాఖ్యల్ని సమర్ధించిన డీకే అరుణ
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. సంజయ్ వ్యాఖ్యల్ని సమర్ధించారు. ఆయన మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదని వెనకేసుకొచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను అరెస్ట్ చేస్తారా అని అడిగిన ప్రశ్నకు.. అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా అనడం తెలంగాణలో వాడుకలో ఉన్న నానుడి అని వివరించారు. కవిత లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు వస్తేనే బీఆర్ఎస్ నేతలు ఇంత రాద్ధాంతం చేయడం ఏమిటని విమర్శించారు డీకే అరుణ. గవర్నర్ తమిళిసైని కౌశిక్ రెడ్డి తిట్టినప్పుడు వీళ్లంతా ఏమయ్యారని ప్రశ్నించారు. కేసీఆర్ కుమార్తె ఒక్కతే ఆడబిడ్డ.. మిగిలిన వాళ్లంతా కాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.