Advertisement
తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమం పేరుతో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ జరుగుతోంది. ప్రజలకే పంచుతున్నామని ప్రభుత్వాలు ప్రకటించుకున్నా.. తర్వాత అప్పులకు వడ్డీలు కట్టలేక పెంచుతున్న పన్నల భారం జనంపైనే పడుతోంది. ప్రభుత్వాలు ఏటేటా అప్పులు చేస్తూనే సంక్షేమ పాలన అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నాయి. అయితే.. తాజాగా కేంద్రం తెలుగు రాష్ట్రాలకు చెందిన అప్పుల వివరాలు బయటపెట్టడం హాట్ టాపిక్ గా మారింది.
Advertisement
లోక్ సభలో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వకంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పారు. అప్పుల లిస్టులో ఏ రాష్ట్రం ఏ స్థానంలో ఉందో వివరించారు. 8వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటే.. తెలంగాణ 11వ స్థానంలో ఉందని కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఇది బంగారు తెలంగాణ కాదు అప్పుల తెలంగాణ అని కామెంట్లు పెడుతున్నారు.
Advertisement
రాష్ట్ర అప్పులు ఏటేటా పెరుగుతున్నాయని కేంద్రం గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన ఐదేళ్లలో తెలంగాణ అప్పులు 94.75 శాతం పెరిగినట్లు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ వివరించింది. 2018లో రూ.లక్షా 60వేల 296 కోట్ల వరకు ఉన్న అప్పులు.. 2022 నాటికి రూ.3లక్షల 12 వేల 191.3 కోట్లకు చేరినట్లు పేర్కొంది. 2016లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో అప్పుల శాతం 15.7 ఉండగా.. 2022 నాటికి 27.4 శాతం నమోదైనట్లు వివరించింది.
ఇక ఏపీలో అయితే.. మరింత పెరిగిపోతున్నాయి. 2018 లో ఏపీ రుణాలు 2 లక్షల 29 వేల కోట్లు కాగా.. ఇప్పుడు 3 లక్షల 98 వేల కోట్లకు చేరిందని స్పష్టం చేసింది కేంద్రం. 2015లో రాష్ట్ర జీడీపీలో 23.3 శాతం అప్పులు ఉండగా.. 2021 నాటికి అది 36.5 శాతానికి పెరిగినట్టు కేంద్రం వెల్లడించింది.