Advertisement
2014 ఎన్నికల్లో జనసేన, బీజేపీ పొత్తుతో సీఎం అయ్యారు చంద్రబాబు. అయితే.. అనూహ్యంగా టీడీపీ పాలనపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికలకు ముందు అటు టీడీపీ, ఇటు బీజేపీతో తెగదెంపులు చేసుకుని వామపక్షాలు, బీఎస్పీతో కలిసి పోటీ చేశారు. అయితే.. చంద్రబాబు కూడా బీజేపీతో కయ్యానికి కాలుదువ్వారు. యుద్ధం మొదలుపెడుతున్నా.. కాచుకో అంటూ మోడీకి సవాల్ విసిరారు. కానీ, జనసేన ఓట్ల చీలికతో టీడీపీ ఘోర ఓటమిని చవిచూసింది. అప్పటి నుంచి చంద్రబాబులో మెల్లమెల్లగా మార్పులు వచ్చాయి.
Advertisement
వైసీపీ సర్కార్ రివెంజ్ ప్లాన్ కు దిగడంతో చంద్రబాబు చేసేదేం లేక సైలెంట్ గా పొత్తుల రాజకీయ నడుపుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. మళ్లీ బీజేపీకి, జనసేనకు దగ్గరయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని అనుకుంటున్నారు. అయితే.. రాష్ట్ర బీజేపీ మాత్రం దగ్గరకు రానిచ్చే ప్రసక్తే లేదని అంటోంది. అయితే.. కేంద్ర నాయకత్వం మాత్రం చంద్రబాబు విషయంలో అంత సీరియస్ నెస్ లేదనే వాదన లేకపోలేదు. ఎన్నికల సందర్భంలో తనను చెడామడా తిట్టేసిన చంద్రబాబును ఎంతో ఆప్యాయంగా మోడీ పలకరించడం చూశాక.. అనేక అనుమానాలు తెరపైకి వచ్చాయి.
Advertisement
ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కొన్నాళ్ల క్రితం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అక్కడ మోడీని కలిశారు. దాదాపు ఐదు నిమిషాలపాటు ఇద్దరు ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాక.. పొత్తు వార్తలు తెగ హల్ చల్ చేశాయి. చంద్రబాబులోనూ కొత్త ఆశలు చిగురించాయని రాజకీయ పండితులు విశ్లేషణ చేశారు. ఇంకోవైపు జనసేనతోనూ సఖ్యతగా ఉంటూ వస్తున్నారు బాబు. ఈమధ్యే పవన్ ను కలిసి ప్రభుత్వంపై పోరాడదామని పిలుపునిచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి ఢిల్లీ బాట పట్టారు చంద్రబాబు.
డిసెంబర్ 5న దేశ రాజధానికి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశంలో పాల్గొననున్నారు. భారత్ లో నిర్వహించే జీ-20 భాగస్వామ్య దేశాల సదస్సుపై చర్చించనున్నారు. 5న రాష్ట్రపతి భవన్ లో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనుంది. రాజకీయ పార్టీల అధినేతల సూచనలు, అభిప్రాయాలను కేంద్రం తెలుసుకోనుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చంద్రబాబుకు ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానించారు. కేంద్రం ఆహ్వానం మేరకు హస్తినబాట పట్టారు చంద్రబాబు. అయితే.. మోడీతో మరోసారి భేటీ అవుతారా? అనేది ఉత్కంఠగా మారింది.