Advertisement
ఈరోజుల్లో హీరోలవ్వాలన్నా.. జీరోలు కావాలన్నా సోషల్ మీడియానే వేదిక. ముఖ్యంగా రాజకీయ పార్టీలు దీన్ని ఓ అస్త్రంగా మలుచుకుంటున్నాయి. ఓవైపు తమను హైలైట్ చేసుకుంటూనే.. ఇంకోవైపు ప్రత్యర్థుల ఫ్యూజులు ఎగిరిపోయేలా గ్రాఫిక్స్ తో పోస్టర్లు, వీడియోలు వదిలి రాజకీయ లబ్ది పొందుతున్నారు. ఇప్పుడు అన్ని పార్టీలు దీన్ని అవలంభిస్తున్నాయి. అయితే.. కొందరు కార్యకర్తలు మాత్రం అత్యుత్సాహం చూపిస్తూ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడేలా చేస్తున్నారు.
Advertisement
అనంతపురంలో హైటెన్షన్ నెలకొంది. రాప్తాడు అభివృద్ధిపై వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య చెలరేసిన వివాదం.. చినికిచినికి గాలివానలా మారింది. ముందుగా.. టీడీపీ కార్యకర్త ఒకరు.. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించాడు. దానికి వైసీపీ మద్దతుదారుడు ఒకడు.. పరిటాల కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. రెండు పార్టీలకు చెందిన ఇద్దరు వ్యక్తులు తమ నేత గొప్ప అంటే తమ నేత గొప్ప అంటూ సోషల్ మీడియాలో సవాళ్లు విసురుకున్నారు.
Advertisement
దమ్ముంటే రాప్తాడు వెళ్లి మాట్లాడాలని.. టీడీపీ మద్దతుదారులు అనడంతో గుంటూరుకు చెందిన వైసీపీ కార్యకర్త హరికృష్ణారెడ్డి అక్కడకు వెళ్లాడు. తాను రాప్తాడు, అనంతపురం వచ్చానంటూ వీడియో రిలీజ్ చేశాడు. అంతేకాకుండా, టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దేవుని భూమి కబ్జా చేసి కట్టిన టీడీపీ కార్యాలయం దగ్గరే ఉన్నానని కవ్వించాడు. అనంతపురం టవర్ క్లాక్ దగ్గరకు వస్తే అన్నీ క్లారిటీగా వివరిస్తానని సవాల్ చేశాడు. దీంతో వివాదం మరింత రాజుకుంది.
సవాల్ ను స్వీకరించిన టీడీపీ కార్యకర్తలు.. టవర్ క్లాక్ దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ, అప్పటికే పోలీసులు ఎంట్రీ ఇచ్చి హరికృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. అలాగే, అక్కడకు వచ్చిన టీడీపీ వర్గీయులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రాళ్ల దాడి జరిగింది. ఓ పోలీసు అధికారి తలకు గాయం కావడంతో ఆస్పత్రికి తరలించారు.