Advertisement
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ లీడర్లలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రూటే సపరేటు. రేవంత్ తో ఉన్న విభేదాల కారణంగా ఆయన నియోజకవర్గానికే పరిమితం అయ్యారు ఇన్నాళ్లు. కానీ, ఈమధ్య పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ యాక్టివ్ అయ్యారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో యాత్రకు కూడా సిద్ధం అవుతున్నారు. ఈమధ్యే బైక్ యాత్ర చేయాలా? బస్సు యాత్ర చేయాలా? అనేది త్వరలోనే చెబుతానని ప్రకటించారు. అయితే.. ఆదివారం అనూహ్యంగా కోమటిరెడ్డిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కలవడం హాట్ టాపిక్ గా మారింది.
Advertisement
హైదరాబాద్ లోని కోమటిరెడ్డి ఇంటికి వెళ్లారు భట్టి. ఈనెల 16వ తేదీ నుండి తాను ప్రారంభించనున్న పాదయాత్ర గురించి వెంకట్ రెడ్డితో చర్చించారు. ఈ యాత్రకు సహకరించాలని కోరారు. సుమారు గంటకు పైగా వీరి భేటీ కొనసాగింది. సమావేశం ముగిసిన తర్వాత ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. యాత్రకు సంబంధించి కోమటిరెడ్డి కొన్ని సూచనలు చేశారని అన్నారు భట్టి. రేవంత్ రెడ్డి పాదయాత్ర రూట్ వేరని.. తన యాత్ర రూట్ వేరేనని చెప్పారు. టికెట్ల కేటాయింపులో నిర్ధిష్ట విధానాన్ని కాంగ్రెస్ పార్టీ పాటిస్తుందని తేల్చి చెప్పారు.
Advertisement
ఇక కోమటిరెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండలో బహిరంగ సభ పెట్టాలని కోరానని అన్నారు. అలాగే, మంచిర్యాల, జడ్చర్ల లేదా షాద్ నగర్ లో బహిరంగ సభ పెట్టాలని కోరినట్లు చెప్పారు. నకిరేకల్, సూర్యాపేటలో మినీ పబ్లిక్ మీటింగ్ పెట్టాలని.. పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి శని, ఆదివారాల్లో యాత్రలో పాల్గొంటానని భట్టితో చెప్పినట్లు వివరించారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. అయితే.. ఆయనకు పోటీగా ఇతర సీనియర్ నేతలు కూడా యాత్రలకు సై అంటుండడం చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇటీవల బాసర నుంచి తన పాదయాత్ర ప్రారంభించారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ లాంటి కొంతమంది నేతలు పాల్గొన్నారు. ఇప్పుడు రేవంత్ యాత్రకు పోటీగా భట్టి విక్రమార్క కూడా యాత్రను ప్రారంభిస్తుండటం టీ కాంగ్రెస్ లో చిచ్చు రగిలిస్తోంది. రేవంత్ యాత్రకు సహకరించని సీనియర్ నేతలు.. పోటీగా యాత్రలు చేపడుతుండటంతో కార్యకర్తల్లో కాస్త కన్ఫ్యూజన్ నెలకొందనే మాటలు వినిపిస్తున్నాయి.