Advertisement
కేసీఆర్, ఈటల రాజేందర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. కేసీఆర్ ను గద్దె దించుతానని ఈటల శపథం చేసి ఉన్నారు. ఇలాంటి సమయంలో బడ్జెట్ సమావేశాలు రావడం.. ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగడం జరిగింది. అయితే.. సమావేశాల చివరి రోజు సుదీర్ఘంగా మాట్లాడారు కేసీఆర్. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నడూ లేనిది ఈటల రాజేందర్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఇది పొగడ్తలా? లేక వ్యంగ్యాస్త్రాలా? అనే చర్చ సాగుతోంది.
Advertisement
తమకు ఎలాంటి బేషజాలు లేవన్న సీఎం.. తమకు ఎవరు మంచి సలహాలు, సూచనలు ఇచ్చినా స్వీకరిస్తామని తెలిపారు. పదే పదే ఈటల పేరును ప్రస్తావించిన కేసీఆర్.. ఓ సందర్భంలో మా ఈటల రాజేందర్ అంటూ గతంలో మాదిరిగా ఆత్మీయంగా మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో బ్రోకర్లు, పైరవీలు చేసినవాళ్లు గెలిచారని అంటూ.. సన్నబియ్యం సలహా ఆనాడు ఈటల రాజేందర్ ఇచ్చారన్నారు. మాట్లాడితే జై శ్రీరామ్ అంటారు కానీ, గుండెల్లో మాత్రం ఉండదు వాళ్లకు అని బీజేపీని విమర్శించారు. కమ్యూనిటీ హాల్స్ ఫర్ ఆల్ కమ్యూనిటీస్.. దీనికి పేరు కూడా మా ఈటల రాజేందరే పెట్టారని గుర్తు చేశారు.
Advertisement
డైట్ ఛార్జీలు పెంచాలని ఈటల రాజేందర్ కోరిక మేరకు పెంచుతున్నామన్నారు కేసీఆర్. రాజేందర్ చెప్పారు కాబట్టి చేయం అని అనొద్దని, కావాలంటే ఆయనకు ఫోన్ చేసి సలహాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇరిగేషన్ పై ఈటల రాజేందర్ సలహాలు సూచనలు పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. ఆర్టీసీ బస్సులు, రైతు రుణమాఫీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. గెస్ట్ లెచ్చలర్స్ పై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు కేసీఆర్. రెండు గంటల ప్రసంగంలో కేసీఆర్ పదిసార్లకు పైగా ఈటల పేరు ప్రస్తావించారు. ఈటల పేరు ప్రస్తావించే సమయంలో ఘర్ వాపసీ అంటూ అసెంబ్లీలో సభ్యులు నినాదాలు చేశారు.
కేసీఆర్ తన పేరును పదేపదే ప్రస్తావించడంతో ఈటల స్పందించారు. సీఎం మాటలకు తాను పొంగిపోనని.. గతంలో జరిగిన అవమానాలను ఎన్నటికీ మర్చిపోనన్నారు. ఈటల అనే వ్యక్తి కేసీఆర్ మెతక మాటలకు పడిపోడంటూ స్పష్టం చేశారు. పలకరించుకుంటే, పక్కన కూర్చుంటే పార్టీలు మారే వ్యక్తిని కాదని అన్నారు. తనను డ్యామేజ్ చేసే వ్యూహంతోనే కేసీఆర్ అలా మాట్లాడారని చెప్పారు. తాను బీఆర్‌ఎస్ పార్టీని వీడలేదని, వాళ్లే బయటకు పంపారని గుర్తు చేశారు. మళ్ళీ పిలిచినా బీఆర్‌ఎస్ లోకి వెళ్లనని స్పష్టం చేశారు.