Advertisement
కేసీఆర్ ఎప్పుడేం చేస్తారో ఎవరికీ తెలియదు. అంతా సస్పెన్స్ కొనసాగించి చివరిలో రివీల్ చేస్తుంటారు. ఒక్కోసారి ఇది ఎదుటివారికి షాకిస్తుంటుంది. చాలాకాలంగా గవర్నర్ తమిళిసై పాల్గొంటున్న కార్యక్రమాలకు కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ పర్యటన పెట్టుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గవర్నర్ తో కలిసి ఆయన స్వాగతం చెప్పారా? లేదా? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
Advertisement
ముర్ము శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగారు. కానీ, అందరికీ గవర్నర్ కనిపించారు కానీ, కేసీఆర్ జాడ ఎక్కడా లేదు. మంత్రి సత్యవతి రాథోడ్ మాత్రం ఉన్నారు. రాష్ట్రపతికి వారిద్దరే స్వాగతం చెప్పారు. అయితే.. అక్కడి నుంచి శ్రీశైలం వెళ్లారు ముర్ము.. ప్రత్యేక పూజలు చేసి మళ్లీ హైదరాబాద్ తిరుగుపయనం అయ్యారు. రాష్ట్రపతి భవన్ కు దగ్గరగా ఉండే హకీంపేట విమానాశ్రయంలో దిగారు. అక్కడ మాత్రం కేసీఆర్ ఉన్నారు. పైగా బీఆర్ఎస్ నేతలందరినీ వెంటపెట్టుకుని వెళ్లారు.
Advertisement
హకీంపేట విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రెసిడెంట్ కు ఘన స్వాగతం పలికారు కేసీఆర్. అనంతరం యుద్ధ వీరుల స్మారకం వద్ద అమరులకు ముర్ము అంజలి ఘటించారు. ఇక అక్కడకు వచ్చిన నేతలందరినీ పేరుపేరునా పలకరించి.. రాష్ట్రపతికి పరిచయం చేశారు కేసీఆర్. విచిత్రం ఏంటంటే.. ప్రతిపక్ష నేతలు బండి సంజయ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల గురించి కూడా ఆయనే చెప్పారు.
అయితే.. ముర్ము గౌరవార్థం గవర్నర్ తమిళిసై ఇచ్చిన విందుకు కేసీఆర్ గైర్హాజరయ్యారు. సోమాజీగూడ రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొనలేదు. దీంతో తమిళిసై, కేసీఆర్ మధ్య ఉన్న విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. సాయంత్రం స్వాగతం చెప్పే సమయంలో ఇద్దరూ నవ్వుతూ కనిపించడంతో రాజ్ భవన్ కు కేసీఆర్ వెళ్తారని అందరూ అనుకున్నారు. కానీ, అది జరగలేదు. ఈనెల 30 వరకు రాష్ట్రపతి బొల్లారంలోనే విడిది చేస్తారు. భద్రాచలం, రామప్ప, యాదాద్రి ఆలయాలను సందర్శిస్తారు. హైదరాబాద్ లో పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు.