Advertisement
ఏపీలో కూడా విస్తరించాలని వ్యూహాల్లో ఉన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ క్రమంలోనే అక్కడి సమస్యలపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎక్కకువ దృష్టి సారించారు. అటు కేసీఆర్, ఇటు కేటీఆర్ తరచూ స్టీల్ ప్లాంట్ అంశంలో కలగజేసుకుని ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ సర్కార్ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
Advertisement
విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహణకు సంబంధించిన బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింగరేణి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ, నీటిపారుదల శాఖ ఈ మూడింటిలో ఏదో ఒక దాని తరఫున బిడ్డింగ్ లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ వైఖరిని వెల్లడించడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కోసమే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.
Advertisement
ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కూడా స్పందించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంతో చరిత్ర కలిగిందని.. ప్రైవేటీకరణ అనేది క్రూరమైన చర్యగా అభివర్ణించారు. స్టీల్ ప్లాంట్ రక్షణ బాధ్యత బీఆర్ఎస్ దేనని తెలిపారు. రాజకీయ కుట్రలను అడ్డుకుని తీరుతామని, విశాఖ వాసులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. తాను విశాఖలో చదువుకున్నానని, అప్పుట్లో స్టీల్ ప్లాంట్ ఉద్యమాలను కళ్లారా చూశానంటూ గుర్తు చేశారు చంద్రశేఖర్.
బీఆర్ఎస్ దూకుడుతో వైసీపీకి చిర్రెత్తుకొచ్చింది. మంత్రి గుడివాడ అమర్నాథ్ అంశంపై స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించకూడదనేదే తమ వాదనగా చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ ప్రక్రియకు సిద్ధమైతే, తాము బిడ్డింగ్ లో ఎలా పాల్గొంటామని, అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించకూడదు అన్నదే తమ విధానం అని అన్నారు. తమ స్టాండ్ అదైనప్పుడు ప్లాంట్ ను తాము ఎలా కొంటామంటూ ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడం కరెక్ట్ కాదని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు తాము కూడా బిడ్ వేస్తామని వారు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బిడ్డింగ్ వేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేయమనేది వారి ఉద్దేశం అన్నట్టుగా కనిపిస్తోందన్నారు. ఈ అంశం గురించి కేసీఆర్ నుండి కానీ.. తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదని తెలిపారు మంత్రి.