Advertisement
మొన్నటి వర్షాలకు రాష్ట్రంలో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా భువనగిరి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో అధ్వాన్నంగా తయారయ్యాయి. దీనిపై స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రోడ్ల పరిస్థితిని వివరిస్తూ సీఎంకు లేఖ కూడా రాశారు. ఓవైపు అకాల వర్షాలు, మరోవైపు ఇసుక మాఫియా అరాచకాలతో నల్గొండ జిల్లాలో రహదారులు నరకాన్ని తలపిస్తున్నాయని లేఖలో వివరించారు.
Advertisement
గతుకుల రోడ్లు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయని.. ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తి మృతి గురించి లేఖలో ప్రస్తావించారు. నిత్యం అక్రమంగా ఓవర్ లోడ్ తో వందల లారీలు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తుంటే అడ్డుకోవాల్సిన యంత్రాంగం, అమ్ముడుపోయిందా.. చేష్టలుడిగి పోయిందా.. అర్థం కావడం లేదని ప్రశ్నించారు. వెంటనే పాడయిన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Advertisement
ఇటు గ్రామాల్లో రోడ్ల పరిస్థితిపై ప్రజల్లోనూ అసంతృప్తి నెలకొని ఉంది. టీఆర్ఎస్ లీడర్ ఎవరు కనిపించినా నిలదీస్తున్నారు. ఆఖరికి మంత్రులకు కూడా ఇది తప్పడం లేదు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రహదారుల విషయంపై ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిపై ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పాడయిన రోడ్లను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. రోడ్లు ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని చెప్పారు.
మారుమూల గ్రామాల్లో కూడా రోడ్ల పరిస్థితిపై దృష్టి పెట్టాలని చెప్పిన సీఎం.. దెబ్బతిన్న వాటికి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. వర్షాలు, వరదలు, వివిధ కారణాలతో రోడ్లు పాడయిపోతే వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని, మరమ్మతు పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రోడ్లు భవనాల మంత్రి ప్రశాంత్ రెడ్డి, పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహా పలువురు నేతలు పాల్గొన్నారు.