Advertisement
హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా మారిపోయింది. పార్టీ నేతల సమక్షంలో అఫీషియల్ గా బీఆర్ఎస్ పత్రాలపై సంతకం చేశారు కేసీఆర్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా భారీ కాన్వాయ్ తో పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు కేసీఆర్. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీఆర్ఎస్ ను గుర్తిస్తూ ఈసీ పంపిన లేఖపై రిప్లైగా మధ్యాహ్నం 1.20 నిమిషాలకు సంతకం చేశారు.
Advertisement
అందరి సమక్షంలో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, ఆయన సోదరుడు రేవన్న హాజరయ్యారు. అలాగే సినీ నటుడు ప్రకాష్ రాజ్ తో పాటు వివిధ రాష్ట్రాల రైతు సంఘం నేతలు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం నేతలందరికీ ప్రగతి భవన్ లో విందు ఏర్పాటు చేశారు కేసీఆర్. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న లక్ష్యంతో తెలంగాణ మోడల్ ను చూపిస్తూ.. భారత్ ను బాగు చేసుకుందామని బయలుదేరారు కేసీఆర్. కొంతమంది లీడర్లను కలిసి మద్దతు కోరుతున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలను ఒక్కటి చేసే పనిలో ఉన్నారు.
అయితే.. బీఆర్ఎస్ కు జాతీయ పార్టీ గుర్తింపు రావాలంటే చాలా కష్టాలు దాటాల్సి ఉంది. ఒక్క తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేసి సీట్లు, ఓట్లు సాధించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ రేసులో కేజ్రీవాల్ సారథ్యంలోనే ఆమ్ ఆద్మీ ముందుంది. ఆ పార్టీ రెండు రాష్ట్రాలను ఏలుతోంది. తాజాగా విడుదలైన గుజరాత్ లో ఐదు అసెంబ్లీ సీట్లను సాధించింది. గుజరాత్ లో ఆరు కన్నా ఎక్కువ శాతం ఓట్లు తెచ్చుకుంది. దీంతో జాతీయ పార్టీ హోదా గుర్తింపు వచ్చినట్లేనని ఆప్ నేతలు చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న చాలా రాష్ట్రాల్లో ఒక శాతం కన్నా ఎక్కువ ఓట్లు రావడం లేదు. కానీ, కొన్ని రాష్ట్రాల్లో బలంగా అడుగేస్తోంది. ఈ కారణంగా జాతీయ హోదా వచ్చేసింది.
Advertisement
ప్రస్తుతం బీజేపీని ఢీ కొట్టడానికి కాంగ్రెస్ తోపాటు జాతీయ పార్టీగా ఆప్ కూడా చేరింది. ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో మరో జాతీయ పార్టీని పెట్టారు. కానీ, ఈసీ పేరు మార్చింది కానీ జాతీయ పార్టీగా అప్పుడే గుర్తించదు. అలా చేయాలంటే పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లు ఆరు శాతం ఉండాలి. కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి. ఇలా చాలా సవాళ్లు బీఆర్ఎస్ ముందు ఉన్నాయి. వీటిని దాటుకుని బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఎప్పటికి గుర్తింపు తెచ్చుకుంటుందో అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆమ్ ఆద్మీ పార్టీ 2012 నవంబర్ 26న కేజ్రివాల్ స్థాపించారు. ఇన్నాళ్లకు ఆ పార్టీ ఇతర రాష్ట్రాల్లో ఈసీ రూల్స్ కు తగ్గట్టు పార్టీని విస్తరించింది. కేసీఆర్ ప్రారంభించిన బీఆర్ఎస్ కూడా ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. కర్ణాటక ఎన్నికల్లో మద్దతు మాత్రమే ఇస్తారని జేడీఎస్ ఇప్పటికే ప్రకటించింది. అంటే.. పార్లమెంట్ ఎన్నికల్లోపు ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పోటీ చేసే చాన్స్ లేదు. సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాల్సిందే. మరి.. కేసీఆర్ ఏం చేస్తారో చూద్దాం.