Advertisement
సాధారణంగా బడ్జెట్ అనగానే అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలతాయి. అయితే.. ఈసారి వెరైటీగా రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ వార్ నడుస్తోంది. బిల్లులు, ప్రోటోకాల్ విషయంలో ఇప్పటికే వివాదం నడుస్తుండగా.. ఇప్పుడు బడ్జెట్ సెషన్ కూడా యాడ్ అయింది. గవర్నర్ ప్రసంగం లేకుండా చేస్తుండడంతో తమిళిసై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో బడ్జెట్ కు ఆమె ఆమోదం తెలపకపోవడం వివాదాస్పదమైంది.
Advertisement
బడ్జెట్ పై గవర్నర్ తీరును ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. లంచ్ మోషన్ కు అనుమతించాలని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానాన్ని కోరగా.. ఇందులో న్యాయ వ్యవస్థ ఎలా జోక్యం చేసుకుంటుందని వ్యాఖ్యానించింది. గవర్నర్ కు కోర్టు నోటీసు ఇవ్వగలదా అనేది ఆలోచించుకోవాలని హైకోర్టు ఏజీకి సూచించింది. గవర్నర్ విధుల్లో కోర్టులు న్యాయ సమీక్ష చేయవచ్చా? అని అడిగింది. కోర్టులు మితిమీరి జోక్యం ఉందని మీరే అంటారు కదా అని వ్యాఖ్యానించింది.
Advertisement
అయితే.. పిటిషన్ కు అనుమతిస్తే తాము పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏజీ వివరించారు. దీంతో హైకోర్టు అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుశ్వంత్ ధవే వాదనలు వినిపించనున్నారు. అసెంబ్లీ ప్రొరోగ్ కాలేదని గతంలో జరిగిన సమావేశాల కొనసాగింపుగానే ఈసారి కూడా శాసనమండలి, శాసనసభను సమావేశపరుస్తున్నామని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. దీంతో బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ప్రసంగం లేకుండా పోయింది.
మరోవైపు బడ్జెట్ కు ఆమోదం తెలకపోవడంతో గవర్నర్ తీరుపై శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని, అహంకార ధోరణితో ఉండొద్దని మహాత్మా గాంధీ అనేవారని గుర్తు చేశారు స్పీకర్ పోచారం. ప్రభుత్వాలు మారడం కాదు.. ప్రజల బతుకులు మారాలన్నారు. ధనికుల ధనాన్ని పేదలకు పంచిపెడతాం అనే వ్యాఖ్యలు మాటలకు మాత్రమే పరిమితం కావొద్దని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.