Advertisement
రాహుల్ గాంధీ అనర్హత వేటు చుట్టూ జాతీయ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. ఉభయ సభల్లో ఎలాంటి చర్చలు, బిల్లుల ఆమోదం లేకుండా వాయిదాలతోనే సరిపోతోంది. అదానీ ఇష్యూ, రాహుల్ అనర్హతపై చర్చకు గట్టి పట్టుదలతో పోరాడుతున్నాయి విపక్ష పార్టీలు. ఈ అంశంపై విరోధ పార్టీలు సైతం కలిసి అడుగులేస్తున్నాయి. ఈక్రమంలోనే కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని చూస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో సత్యాగ్రహ దీక్ష చేపట్టగా.. తాజాగా జై భారత్ సత్యాగ్రహం పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.
Advertisement
30 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది కాంగ్రెస్. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ వెల్లడించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు దీన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పారు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని మరోసారి ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఎన్నిసార్లు డిమాండ్ చేసినా లోక్ సభ స్పీకర్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
మరోవైపు తన బంగ్లా ఖాళీ చేసేందుకు సిద్ధమయ్యారు రాహుల్ గాంధీ. తుగ్లక్ రోడ్డులోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలంటూ లోక్ సభ సచివాలయం లేఖ పపండంతో ఆయన కాస్త వ్యంగ్యంగా స్పందించారు. ఈనెల 27న మీరు రాసిన లేఖ అందిందని, ఇందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. మీ నిబంధనలకు కట్టుబడి ఉంటానని చెప్పారు.
ప్రజలిచ్చిన తీర్పు నేపథ్యంలో ఇక్కడ, ఈ భవనంలో తాను గడిపిన ఆనంద స్మృతులను మరిచిపోలేనని అన్నారు రాహుల్. తన హక్కులకు ఎలాంటి భంగం కలగలేదని పేర్కొన్న ఆయన.. మీ లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉంటానని తెలిపారు. రూల్స్ ప్రకారం రాహుల్ గాంధీ.. తన అనర్హతకు సంబంధించిన ఉత్తర్వులను కోర్టు ప్రకటించినప్పటి నుంచి నెల రోజుల్లోగా ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 22 లోగా భవనాన్ని ఖాళీ చేయాలని రాహుల్ కు పంపిన నోటీసులో ఉంది.