Advertisement
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. పార్టీ ముఖ్య నేతలు పాదయాత్ర, బస్సు యాత్ర, బైక్ యాత్ర ఇలా ఏదో ఒకటి చేసి అధికారాన్ని కాంగ్రెస్ కి దగ్గర చేయాలని చూస్తున్నారు. హాత్ సే హాత్ యాత్ర సందర్భంగా కరీంనగర్ కవాతు పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. దీనికి ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ భగేల్ హాజరయ్యారు. రాష్ట్రంలో కేవలం ఉపాధి ఒక కుటుంబానికి మాత్రమే దొరికిందన్నారు. దేశంలో రెండు మోడల్స్ ఉన్నాయని.. అందులో ఒకటి గుజరాత్, రెండోది కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఛత్తీస్ గఢ్ అని పేర్కొన్నారు.
Advertisement
టీఆర్ఎస్ మోడల్ కేవలం ఒక కుటుంబానికేనని విమర్శించారు భూపేశ్. అదే, ఛత్తీస్ గఢ్ మోడల్ వేరన్నారు. దేశంలోకెల్లా రైతులకు ఎంతో మేలు చేసిన ప్రభుత్వమని చెప్పారు. తెలంగాణలోనూ ఛత్తీస్ గఢ్ మోడల్ ను అమలు చేద్దామన్నారు. నిరంకుశ పాలన నుంచి పేదలు, రైతుల సంక్షేమాన్ని కోరే కొత్త తెలంగాణ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అది మీ చేతుల్లోనే ఉందని ప్రజలను కోరారు.
Advertisement
ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ థాక్రే మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జోడో యాత్ర చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. సోనియాగాంధీ ఇదే స్టేడియంలో తెలంగాణ ఇస్తానని మాట ఇచ్చారన్నారు. సబ్బండ వర్గాలు అభివృద్ధి చెందాలనే రాష్ట్ర ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాలు ముందుకు తీసుకెళ్లేందుకే సోనియా తెలంగాణ ఇచ్చారని.. కేసీఆర్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అన్యాయాలు, అక్రమాలేని విమర్శలు చేశారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ దొందూ దొందేనన్నారు థాక్రే.
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ సీనియర్ లీడర్ జైరాం రమేష్ మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో కాంగ్రెస్ నేతలంతా తెలంగాణ కావాలని ముక్తకంఠంతో కోరారని వివరించారు. అందరి కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. జోడో యాత్ర కాంగ్రెస్ కు బూస్టర్ డోస్ లా పనిచేసిందని.. కేసీఆర్ హఠావ్… తెలంగాణ బచావో అంటూ పిలుపునిచ్చారు. కేసీఆర్ ను ఓడించి తెలంగాణను కాపాడుకోవాలన్నారు. చరిత్రలో తానీషా, నిజాం నిరంకుశ పాలన గురించి పుస్తకాల్లో చదివామని.. కేసీఆర్ 8వ నిజాంలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ చెబుతున్న తెలంగాణ మోడల్ అంటే తాగుబోతుల తెలంగాణనా? అని ప్రశ్నించారు. సీఎంగా కేసీఆర్ వచ్చాక రాష్ట్రంలో 3వేల వైన్ షాపులు, 60వేల బెల్టు షాపులు వచ్చాయని మండిపడ్డారు. కేసీఆర్ చెప్పిన తెలంగాణ మోడల్ అంటే ఇదేనా? అంటూ ఫైరయ్యారు.