Advertisement
తెలంగాణ కాంగ్రెస్ లో హైకమాండ్ లెక్కలు మారుతున్నాయి. గెలుపే ప్రామాణికంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. తెలంగాణలో సామాజిక – ప్రాంతీయ సమీకరణాలకు పార్టీ హైకమాండ్ ప్రాధాన్యత ఇస్తుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ వరుస తప్పులతో సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా నిర్ణయాలు అన్నీ ఢిల్లీ నుంచే జరుగుతున్నాయి. ఇప్పుడు అనూహ్యంగా కొత్తగా పార్టీలో చేరిన మాజీ ఎంపీ పొంగులేటికి హైకమాండ్ ప్రాధాన్యత పెంచింది. కీలకమైన ప్రచార కమిటీ కో-చైర్మన్ బాధ్యతలు అప్పగించింది. కేసీఆర్ లోటుపాట్లు తెలియటంతో పాటుగా ఆర్థికంగా కీలకమైన సామాజిక వర్గానికి చెందిన పొంగులేటికి వ్యూహాత్మకంగా పెంచుతున్న ప్రాధాన్యతతో రేవంత్ సమస్యలు సృష్టిస్తున్న వేళచెక్ పెడుతున్నట్లు కనిపిస్తుంది.
Advertisement
‘రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టకూడదు – ఎలాగైనా అధికారంలోకి రావాలి’ ఇదీ కాంగ్రెస్ హైకమాండ్ లక్ష్యం. దీని కోసం నేరుగా పార్టీ వ్యవహారాలను హైకమాండ్ పర్యవేక్షిస్తుంది. వ్యూహాలను రచిస్తుంది. ఎంపిక చేసిన నేతలకు బాధ్యత ఇస్తుంది. పార్టీకి నష్టం చేసే వ్యాఖ్యలు..నేతల వ్యవహార శైలి పైన నిఘా పెట్టింది. అందులో భాగంగా సమర్ధత కలిగిన నేతలకు ప్రాధాన్యత పెంచుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలకుగాను టీపీసీసీ ప్రచార కమిటీని కాంగ్రెస్ నాయకత్వం ఆచి తూచి ఎంపిక చేసింది. ఈ కమిటీలో మాజీ ఎంపీ, ఖమ్మంలో కీలక నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చోటు దక్కింది. పార్టీ మారిన తర్వాత స్పీడ్ పెంచిన పొంగులేటి.. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నారు. రానున్న ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పోటీచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Advertisement
తెలంగాణలో బీజేపీ కూడా రెడ్డి సామాజిక వర్గానికే పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. రెడ్డి సామాజిక వర్గం తెలంగాణలో పలు జిల్లాల్లొ గెలుపు ఓటమలును నిర్దేశించే స్థాయిలో ఉంది. ఈ క్రమంలోనే రేవంత్ కు పగ్గాలు అప్పగించినా, పార్టీ సీనియర్లతో వ్యవహరించిన తీరు, అవసరానికి మించిన దూకుడు…వివాదాస్పద తీరుతో పార్టీకి ఎన్నికల సమయంలో నష్టంగా మారుతుందని హైకమాండ్ గ్రహించింది. దీంతో, రెడ్డి సామాజిక వర్గంలో పట్టు ఉండటంతో పాటుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ వ్యూహాలు పూర్తిగా తెలిసిన వ్యక్తిగా హైకమాండ్ పొంగులేటిని గుర్తించింది. కేసీఆర్ పైన తిరుగుబాటు జెండా ఎగుర వేసిన పొంగులేటి వ్యతిరేకులను కూడగట్టటంలో సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ లోని అందరి నేతలతో పొంగులేటికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
ఇప్పుడు కీలక పదవి ద్వారా బీఆర్ఎస్ వ్యతిరేక..కాంగ్రెస్ అనుకూల ప్రచార బాధ్యతలను అప్పగించింది. రాజకీయ వ్యూహాల్లో పొంగులేటికి ఉన్న అనుభవం పార్టీకి కలిసి వస్తుందని పార్టీ భావిస్తుంది. ఢిల్లీ స్థాయిలోనూ పొంగులేటికి వ్యాపార – రాజకీయ పరంగా ఉన్న సత్సంబంధాలు కలిసి వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించి తీరుతామని పొంగులేటి ధీమాగా చెబుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కు అదే నమ్మకం కలిగించారు. అన్ని రకాలుగా బలమైన నేతగా పొంగులేటిని కాంగ్రెస్ నాయకత్వం గుర్తించింది. అటు ఢిల్లీ నుంచి ఇటు గల్లి వరకు పొంగులేటికి పెరుగుతున్న ఆదరణ, ప్రాధాన్యత పరోక్షంగా రేవంత్ కు అలర్ట్ టైంగా మారుతోంది. గతంలో టీపీసీసీ చీఫ్ ప్రతీ నిర్ణయంలోనూ కీలకంగా ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి టీ కాంగ్రెస్ లో కనిపించటం లేదు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ మూడ్ స్పష్టంగా ఉందనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది.