Advertisement
పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు అంటూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో దిద్దుబాటు చర్యలకు దిగిన కేసీఆర్.. తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్న వారికి ఓ వార్నింగ్ లా వీరిద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారని టాక్ నడుస్తోంది. అయితే.. ఈ సస్పెన్షన్ పై నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో కొనసాగుతోంది.
Advertisement
స్వరాష్ట్ర సాధనలో భాగంగా పదవులను త్యాగం చేసినందుకు బీఆర్ఎస్ పార్టీ తనకు ఇచ్చిన బహుమతే ఈ సస్పెన్షన్ అని జూపల్లి కృష్ణారావు అన్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ లోని 14 స్థానాల్లో 13 చోట్ల బీఆర్ఎస్ గెలిచిందన్న ఆయన… ఆ గెలుపులో తన కష్టం, నిజాయతీ ఉన్నాయన్నారు. తాను ఓడిపోవడానికి ప్రభుత్వ పెద్దలే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. దొరల గడీ నుంచి తనకు విముక్తి లభించినందుకు ఆనందంగా ఉందని పొంగులేటి వ్యాఖ్యానించారు. ఇన్ని రోజులకు తనకు బీఆర్ఎస్ నుంచి విముక్తి లభించిందని చెప్పారు.
Advertisement
సస్పెండ్ అయిన ఇద్దరి నేతల వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. పొంగులేటిపై రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఫైరయ్యారు. అసెంబ్లీ గెట్ నీ అబ్బ సొత్తు కాదన్నారు. బరాబర్ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెడతారని చెప్పారు. పొంగులేటి వెంట తిరిగే వారికి రాజకీయంగా అన్యాయం జరగడం ఖాయమన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఇచ్చిన అవకాశాన్ని రాజకీయంగా దుర్వినియోగం చేసుకున్నారని మండిపడ్దారు.
క్రమశిక్షణ పాటించకుండా ప్రభుత్వాన్ని, పార్టీని విమర్శించినందునే జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేసినట్టు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. వీళ్లిద్దరూ ప్రభుత్వంలో ఉండి.. లాభపడి విమర్శించడం దురదృష్టకరమని అన్నారు. ఓపిక, సహనం అవసరమన్న విషయన్ని జూపల్లి గుర్తిస్తే బాగుండేదని చురకలేశారు. మున్సిపల్, స్థానిక ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా జూపల్లి పనిచేసినా పార్టీ ఎలాంటి చర్య తీసుకోలేదని చెప్పారు.
ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ప్రభుత్వ విప్ రేగా కాంతారావు విమర్శలు గుప్పించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న పొంగులేటి.. పార్టీ మారి మాట్లాడాలే తప్ప తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం కరెక్ట్ కాదన్నారు. మాయమాటలు చెప్పి మోసం చేస్తూ డబ్బాలు కొట్టుకోవడం తప్ప ఏమీ లేదని ధ్వజమెత్తారు. ఆయన గత ఎన్నికల్లో అనేక మందిని మోసం చేశారని ఆరోపించారు రేగా.