Advertisement
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడేకొద్దీ రాజకీయాలు మరీ ఇంట్రస్ట్ గా కొనసాగుతున్నాయి. నాయకులు ఎంతకీ తగ్గడం లేదు. కాస్త డ్యామేజ్ అనిపిస్తే చాలు ధీటుగా బదులిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పొత్తు వ్యాఖ్యలు చేశాక.. మూడు పార్టీల నేతలు ఎవరి వెర్షన్ వారు వినిపిస్తున్నారు. ఎవరితోనూ పొత్తు ఉండదని.. ఒంటరిగానే తాము పోటీకి వెళ్తామని స్పష్టం చేస్తున్నారు.
Advertisement
తెలంగాణలో ఇతర పార్టీలతో పొత్తులు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా గెలిచే సత్తా ఉందని టీపీసీసీ ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రే స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ తో పొత్తులు ఉండవని పునరుద్ఘాటించారు. నాయకులు అంతా ఐక్యంగానే ఉన్నారని, కలిసికట్టుగా పని చేస్తారని వివరించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో సంపూర్ణ మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంటే.. కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని స్పష్టం అవుతోంది.
Advertisement
ఇక రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎవరితోని పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే బరిలోకి దిగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు. ‘‘భారత రాష్ట్ర సమితి అనేది ఒక బలమైన పార్టీ. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. అయితే, వామపక్షాలతో పొత్తు విషయంపై ముఖ్యమంత్రి స్పష్టత ఇస్తారు. రాష్ట్రంలో హంగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పడదు. రాబోయే ఎన్నికల్లో ప్రజల దయ వల్ల మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధిస్తాం. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని కుట్రలు పన్నినా.. ప్రజల్లో ఎంత ప్రచారం చేసినా.. మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే’’ అని చెప్పారు తలసాని.
మరోవైపు వెంకట్ రెడ్డి రాహుల్ గాంధీ ప్రకటనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇప్పటి వరకు సస్పెండ్ చేయ లేదని ధ్వజమెత్తారు బండి సంజయ్. అంటే, ఆ రెండు పార్టీలు ఒక్కటేనని తేలిపోయిందని చెప్పారు. కలిసే డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు. అధికారం పంచుకోవాలని అనుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అనేక సందర్భల్లో కలిసి పనిచేశాయని గుర్తుచేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన మహిళను ఓడించడానికి ఈ రెండు పార్టీలు కలిసి పనిచేశాయని, పార్లమెంట్ లో అనేక ఆందోళనలు కలిసే చేశాయని వివరించారు.
ఇలా మూడు పార్టీల ఎవరికివారు పొత్తులపై క్లారిటీగా చెబుతున్నారు. ఎందులోనూ తగ్గేదే లేదన్నట్టుగా కాస్త డ్యామేజ్ కాకుండా ముందుకు వెళ్తున్నారు. మరి.. ఎన్నికల నాటికి ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.. ఇంకెన్ని మాటల యుద్ధాలు కొనసాగుతాయో చూడాలి.