Advertisement
బీజేపీ, జనసేన కలిసి ఉన్నాయా? విడిపోయాయా? కలిసి ఉంటే ఎందుకీ కన్ఫ్యూజన్ అని ఇరు పార్టీల శ్రేణులు తలలు పట్టుకుంటున్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే.. ఇన్నాళ్లూ జనసేన తమ వెంటే ఉందని బీజేపీ చెబుతూ వచ్చింది. కానీ, జనసేన సైడ్ నుంచి పెద్దగా రియాక్షన్ రాలేదు. కానీ, ఇప్పుడు సీన్ మారిపోయింది. కొండగట్టు పర్యటన సందర్భంగా బీజేపీ తమ పార్టీతో కలిసే ఉందని తెలిపారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. అయితే.. అనూహ్యంగా ఇప్పుడు బీజేపీ వైపు నుంచి సైలెన్స్ కొనసాగుతోంది.
Advertisement
ఎన్నికలప్పుడే పొత్తుల గురించి ఆలోచిస్తామని పవన్ అన్నారు. పొత్తులపై ఎన్నికలకు వారం రోజుల ముందు స్పష్టత వస్తుందని చెప్పారు. కొత్త పొత్తులు కుదిరితే కలిసి వెళ్తామని.. కుదరకపోతే ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. 2014 కాంబినేషన్ ను కాలమే నిర్ణయిస్తుందన్న ఆయన.. ప్రస్తుతానికి బీజేపీతోనే ఉన్నామని తెలిపారు. పొత్తులపై అన్ని పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయని.. ఓట్లు చీలకుండా ఉండాలనేది తన అభిప్రాయమని చెప్పారు. ఈ విషయమై అన్ని పార్టీలు కలిసి రావాల్సి ఉందన్నారు
Advertisement
అయితే.. భీమవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించారు. ఓ రాజకీయ తీర్మానం కూడా చేశారు. అయితే.. ఇందులో జనసేనతో పొత్తు గురించి ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం కొత్త చర్చకు దారితీసింది. వైసీపీతో బీజేపీ సైలెంట్ దోస్తీ చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. కానీ, పొత్తు పెట్టుకునే ఛాన్సులు తక్కువే. అలాగే, టీడీపీతో కలిసే ప్రస్తక్తే లేదని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. ఇదే సమయంలో జనసేన ప్రస్తావన లేకుండా తీర్మానం ఆమోదం కావడం హాట్ టాపిక్ గా మారింది.
బీజేపీ తీరు చూస్తుంటే ఈసారి ఒంటరిగానే పోటీ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు విశ్లేషకులు. కానీ, ఇది ఆపార్టీకి నష్టమేనని సూచిస్తున్నారు. టీడీపీతో పొత్తుకు పవన్ ఆసక్తి చూపిస్తుండడంతో బీజేపీ దూరం జరుగుతోందని చెబుతున్నారు. మరి.. ఎన్నికల నాటికి ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాలని అంటున్నారు విశ్లేషకులు.