Advertisement
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో దర్యాప్తు సంస్థలు దూకుడు కొనసాగిస్తున్నాయి. మధ్యలో కాస్త సైలెంట్ అయిన ఈ కేసు.. డిప్యూటీ సీఎం సిసోడియా అరెస్ట్ తర్వాత మళ్లీ ఊపందుకుంది. ఫిబ్రవరి చివర్లో సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. రెండు దఫాలుగా కస్టడీకి తీసుకుని ప్రశ్నించింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే.. సిసోడియాను ఈడీ కూడా ప్రశ్నించనుంది.
Advertisement
తీహార్ జైలులో ఉన్న సిసోడియాను ఈడీ ప్రశ్నించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే కోర్టు నుంచి అనుమతి పత్రాలు తీసుకున్నట్లు వెల్లడించారు. మనీలాండరింగ్ కు సంబంధించిన అంశాలపై ఆయనను ప్రశ్నిస్తామని తెలిపారు. జైలులో సిసోడియా ఏకాంతంగా ఉంటున్నారు. ఎవరూ గదిని పంచుకోవడం లేదు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. ఈడీ ఆయన్ను ప్రశ్నించిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే ఉత్కంఠ నెలకొంది.
Advertisement
మరోవైపు ఈడీ అధికారులు హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో పది మంది అరెస్ట్ అయ్యారు. తాజా అరెస్ట్ తో ఆ సంఖ్య 11 కు చేరింది. త్వరలో ఇంకొందరిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం. మద్యం కుంభకోణంలో అవకతవకలపై ఇటీవల రెండు రోజుల పాటు రామచంద్ర పిళ్లైని ఈడీ ప్రశ్నించింది. ఈక్రమంలోనే ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు అధికారులు.
ఈ స్కామ్ లో అభిషేక్ బోయిన్ పల్లి, సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్ తదితరులకు రామచంద్ర పిళ్లై సహకరించారని ఈడీ భావిస్తోంది. ఈయనకు చెందిన వట్టినాగులాపల్లిలో 2.2 కోట్ల విలువైన భూమిని కూడా ఈడీ జప్తు చేసింది. కేసులో నిందితుడిగా పేర్కొంది. పలు దఫాలుగా పిళ్లై ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. కీలక సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో దాఖలు చేసిన ఛార్జిషీట్లలో ఆయన పేరు ప్రముఖంగా ఉంది.