Advertisement
గ్రామ పంచాయతీల నిధుల విషయంలో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు శక్తవంచన లేకుండా శ్రమిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఓ అడుగు ముందుకేసి ధర్నాచౌక్ లో నిరసన కార్యక్రమం నిర్వహించింది. బీజేపీ నేతలు, ప్రెస్ మీట్లు, లేఖలతో నిలదీస్తున్నారు. ఈ అంశంపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. రాష్ట్రాన్ని అధ్వాన్నంగా మార్చిన తండ్రీ, కుమారులను ట్యాంక్ బండ్ మీద ఉరేసినా తప్పు లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వైఖరితో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఇంకొందరు పుస్తెలు అమ్ముకున్నారని విమర్శించారు.
Advertisement
ఇటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఆర్ధిక వ్యవస్థ దివాలా తీస్తోందని, జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని అన్నారు. కేసీఆర్ వైఖరి ఇలాగే ఉంటే ఆర్ధిక సంక్షోభం తప్పదని మండిపడ్డారు. గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కోసం ఆర్థిక సంఘం సిఫారసు మేరకు నిధులు విడుదల అయ్యాయని తెలిపారు. కానీ, నిధులను గద్దల్లా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. బ్యాంకుల్లో పడ్డ డబ్బుల్ని గంటలోనే దారి మళ్లించారన్నారు. డబ్బులు పడ్డ మెసేజ్ చూసి సర్పంచులు బ్యాంకులకు వెళ్తే అప్పటికే ఖాళీ అయ్యాయని తెలిసి అవాక్కయ్యారని అన్నారు. సర్పంచులకు తెలియకుండా డిజిటల్ కీ ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు కిషన్ రెడ్డి.
Advertisement
ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు బీఆర్ఎస్ వర్గాల నుంచి ధీటైన జవాబు వస్తోంది. రేవంత్ రెడ్డి రాజకీయ అవసరాల కోసం సర్పంచులను రెచ్చగొడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు రూ.700 కోట్లు రావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.230 కోట్లు ఇస్తోందని వివరించారు. మహబూబాబాద్ లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఇలా రియాక్ట్ అయ్యారు.
కొంతమంది నాయకులు సర్పంచులను రెచ్చగొట్టి గవర్నర్ వద్దకు పంపుతున్నారని మండిపడ్డారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అవగాహన ఉండి మాట్లాడుతున్నారో.. లేకుండా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఫైరయ్యారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగినట్టు చూపిస్తే రాజీనామాకు సిద్ధమని ఇద్దరు నేతలకు సవాల్ విసిరారు ఎర్రబెల్లి దయాకర్.