Advertisement
వరి పండిస్తే మద్దతు ధర ఉండదు.. పత్తి, మిర్చి వేస్తే మార్కెట్ రేట్ ఉండదు.. ఇతర పంటలదీ అదే పరిస్థితి. వర్షాలకు పంట దెబ్బతిన్నా.. తుపాను వచ్చి కొట్టుకుపోయినా.. రైతన్న కష్టం అంతా ఇంతా కాదు. అప్పులు చేసి కాయకష్టంతో సాగు బండి నడిపిస్తుంటారు. అయితే.. ఆ ప్రాజెక్ట్.. ఈ ప్రాజెక్ట్ అంటూ ఏళ్ల తరబడి పండిస్తున్న భూమిని సర్కారు ఇమ్మని అడిగితే రైతన్న ప్రాణం విలవిలలాడిపోతుంది. ఇప్పుడు కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన రైతుల పరిస్థితి అలాగే ఉంది.
Advertisement
ఇండస్ట్రియల్ జోన్ కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేసింది. కామారెడ్డి పట్టణంతో పాటు విలీన గ్రామాలైన అడ్లూర్, టెకిర్యాల్, కాల్సిపూర్, దేవునిపల్లి, లింగాపూర్, సరంపల్లి, పాతరాజంపేట, రామేశ్వరపల్లిని కలుపుకుని 61.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మాస్టర్ ప్లాన్ ముసాయిదా తయారు చేశారు. మొత్తం పట్టణాన్ని ఇండస్ట్రియల్, గ్రీన్, కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్లుగా విభజించి.. ఆ వివరాలను ఈ మధ్యే ప్రకటించారు. 2023 జనవరి 11 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు చెప్పారు. పారిశ్రామిక జోన్ కోసం 1200 ఎకరాలతో 8.5 శాతం ప్రతిపాదించారు. ఇందులో నేషనల్ హైవే పక్కన పచ్చని పంటలు పండే.. అడ్లూర్, ఇల్సిపూర్, టెకిర్యాల్, అడ్లూర్ ఎల్లారెడ్డి రైతులకు చెందిన 900 ఎకరాల భూములను చూపించారు. దీనివల్ల ఆ భూములకు ఒక్కసారిగా డిమాండ్ పడిపోయింది. భవిష్యత్ లో ఇళ్ల నిర్మాణం కూడా కష్టమవుతుందని భావించిన రైతులు ఆందోళనబాట పట్టారు.
Advertisement
ఇండస్ట్రియల్ జోన్ కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ కారణంగా భూమిని కోల్పోతున్నాననే బాధతో రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈక్రమంలోనే అడ్లూర్ లో రైతులు నిరసనకు దిగారు. భారీ మార్చ్ కు సిద్ధమయ్యారు. దీనికి బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది. మాస్టర్ ప్లాన్ లో తమ భూములు పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ 8 గ్రామాల రైతులు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. ఈక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
శుక్రవారం కామారెడ్డి బంద్ కు కూడా పిలుపునిచ్చారు రైతులు. కలెక్టరేట్ వద్ద దిష్టిబొమ్మకు వినతి పత్రం అందించారు. అంతకుముందు కలెక్టరేట్ వద్ద రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఆందోళనలో ఇద్దరు మహిళలు, ఓ రైతు సొమ్మసిల్లి పడిపోయారు. తోపులాటలో కానిస్టేబుల్ కు స్వల్పగాయాలయ్యాయి. కామారెడ్డి కలెక్టరేట్ లోకి దూసుకెళ్లేందుకు రైతులు యత్నించారు. ఈ క్రమంలో కలెక్టరేట్ ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించారు. కలెక్టరేట్ గేటుకు పోలీసులు వేసిన తాళాన్ని పగులగొట్టారు. గేటు దూకి కలెక్టరేట్ లోకి కొందరు రైతులు వెళ్లారు. అయితే.. కలెక్టర్ చర్చలకు సిద్ధమని ప్రకటించారు. మరోవైపు ఈ నిరసనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కలెక్టర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాస్త సీరియస్ అయ్యారని వార్తలు వస్తున్నాయి.