Advertisement
ప్రగతి భవన్, రాజ్ భవన్ పంచాయితీలు కొనసాగుతున్నాయి. రోజుకో వివాదం తెరపైకి వచ్చి తెలంగాణ ప్రజల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా మరోసారి గవర్నర్ తమిళిసై హాట్ కామెంట్స్ చేశారు. రాజ్ భవన్ ఉమెన్స్ డే వేడుకల కార్యక్రమం ఇందుకు వేదికైంది. రాజ్ భవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణించిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడిన గవర్నర్.. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రసంగించారు.
Advertisement
తనను తీవ్ర పదజాలంతో దూషించిన వారికి రివార్డులు ఇస్తున్నారన్నారు. దీనివల్ల మహిళా లోకానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని అడిగారు. తనకు ఎలాంటి వ్యక్తిగత లక్ష్యాలు లేవన్న తమిళిసై.. గవర్నర్ గా పరిధికి లోబడి పని చేస్తున్నానని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయొద్దన్న ఆమె.. ఎన్ని విమర్శలు చేసినా.. వివక్ష చూపినా వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. మహిళా మంత్రులు, మేయర్లు, అధికారులకు ఇన్విటేషన్ పంపిస్తే.. ఎవర రాలేదన్నారు.
Advertisement
తెలంగాణలో ఇంకా ఆత్మహత్యలు కొనసాగుతున్నాయన్న గవర్నర్.. దీనిపై గతంలో తాను చాలాసార్లు బాహాటంగా మాట్లాడానని అన్నారు. ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన ప్రీతి మరణం అత్యంత బాధాకరమని.. ఎవరెన్ని చెప్పినా ఆమె మరణాన్ని పూడ్చలేమమని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మహిళల పట్ల వివక్ష అనేది సరికాదని.. ముందు వారిని గౌరవించడం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు.
ఉమెన్స్ డే ఒక్కరోజే కాదు.. ప్రతిరోజూ మహిళలకు గౌరవం ఇవ్వాలన్నారు తమిళిసై. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు కుష్బూ, నటి పూనమ్ కౌర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పూనమ్.. తాను తెలంగాణలోనే పుట్టి పెరిగానని.. కానీ పంజాబీ అమ్మాయి అని వెలి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను అలా దూరం చేయొద్దని కోరారు.