Advertisement
చాలాకాలంగా తెలంగాణలో నలుగుతున్న అంశం ఎమ్మెల్యేల ఎర కేసు. కోర్టుల్లో ఈ కేసుపై పిటిషన్ల మీద పిటిషన్లు పడుతున్నాయి. అయితే.. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ ఎంట్రీ ఇచ్చింది. ఈ కేసు సీబీఐ ఢిల్లీ విభాగానికి అప్పగించారు. దీనిపై దర్యాప్తు చేయాలని సీబీఐ డైరెక్టర్ ను హైకోర్టు ఆదేశించగా.. ఆ బాధ్యతలను ఢిల్లీ విభాగానికి అప్పగించారు ఆయన.
Advertisement
డైరెక్టర్ ఆదేశాలతో ఓ బృందం హైదరాబాద్ లో అడుగు పెట్టింది. సిట్ నుంచి కేసు పత్రాలు ఇవ్వాలని సీఎస్ కు లేఖ కూడా రాసింది. ఇదంతా హైకోర్టులో వాదనల సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. సింగిల్ జడ్జి బెంచ్ తీర్పుపై ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పై విచారణ జరిగింది. బీజేపీ తరఫున న్యాయవాది దామోదర్ రెడ్డి వాదనలు వినిపించారు. బీజేపీ ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చలేదని, ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయలేదని ధర్మాసనానికి విన్నవించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరాలని బహిరంగ ప్రకటన చేసింది సీఎం కేసీఆర్ అని కోర్టు దృష్టికి తెచ్చారు.
Advertisement
2014 నుంచి 2018 వరకు 37 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారని చెప్పారు. ఈ వాదనలపై స్పందించిన న్యాయమూర్తి బీజేపీ, బీఆర్ఎస్ ప్రస్తావన ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. బీజేపీ పిటిషన్ ను సింగిల్ జడ్జి బెంచ్ డిస్మిస్ చేసిందని, అలాంటప్పుడు బీజేపీ తరఫున మీరు ఎందుకు వాదనలు వినిపిస్తున్నారని అడిగారు. తమ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా సిట్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు ఉన్నందునే తాము కల్పించుకోవాల్సి వచ్చిందని దామోదర్ రెడ్డి చెప్పారు. సిట్ వాదనలకు సమాధానం చెప్పేందుకే రాజకీయాలను ప్రస్తావించానని స్పష్టం చేశారు.
ఇటు కేసు ఫైల్స్ ఇవ్వాలంటూ సీబీఐ ఒత్తిడి చేస్తోందని ప్రభుత్వం తరఫు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఫైల్స్ కోసం సోమవారం వరకు ఎలాంటి ఒత్తిడి చేయవద్దని సీబీఐకి కోర్టు సూచించింది. అయితే.. కేసు ఫైల్స్ కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్లు సీబీఐ పేర్కొంది. ఆ ఫైల్స్ ఇస్తే విచారణ జరిపేందుకు తాము రెడీగా ఉన్నామని న్యాయస్థానానికి సీబీఐ వివరించింది. కేసులో సుప్రీంకోర్టు న్యాయవాది దవే వాదనలు వినిపించనున్నారని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అందువల్ల సోమవారం వరకు తమకు సమయం ఇవ్వాలంటూ కోరింది. కేసు సీబీఐకి ఇవ్వడమే సరైందని హైకోర్టులో బీజేపీ తరఫు న్యాయవాది వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.