Advertisement
తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ పై పోలీసుల దాడులపై ఆపార్టీ నేతలు భగ్గుమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. అయితే.. పోలీసులు ముఖ్య నేతలను రోడ్డెక్కకుండా చూసుకున్నారు. హౌస్ అరెస్ట్ చేశారు. కానీ, కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ.. కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Advertisement
కాంగ్రెస్ వార్ రూమ్ లో పోలీసుల సోదాలను నిరసిస్తూ.. ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు నేతలు. కానీ, పోలీసులు గాంధీ భవన్ దగ్గర భారీగా బలగాలను మోహరించారు. కాంగ్రెస్ కార్యకర్తలు కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన తర్వాత ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరగా.. వారిని అక్కడే నిలువరించారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది.
Advertisement
ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడికి యత్నించారు. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను బలంవంతంగా లాక్కెళ్లి అరెస్ట్ చేశారు. ఈక్రమంలో ఆమె కిందపడిపోయారు. మహిళా పోలీసులు విజయారెడ్డిని పోలీస్ వ్యాన్ లోకి ఎక్కించారు. రాష్ట్రంలోని అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. కాంగ్రెస్ పార్టీ దీనిపై హైకోర్టుని ఆశ్రయించింది. అన్యాయంగా అరెస్ట్ చేసిన కార్యకర్తలు, స్టాఫ్ జాడ చెప్పాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు మల్లు రవి. కనీస సమాచారం లేకుండా పట్టుకెళ్లారని తెలిపారు.
మరోవైపు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పోస్టులపై కేసులు నమోదయ్యాయని సీసీఎస్ సైబర్ క్రైం జాయింట్ సీపీ గజరావ్ భూపాల్ మీడియాకు వివరించారు. ఇతరులను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని.. ఆ కేసులకు సంబంధించి ముగ్గురిని కస్టడీకి తీసుకుని నోటీసులు ఇచ్చామని చెప్పారు. వారి నుంచి పది ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. ఇన్ని రోజులు రహస్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని.. టెక్నాలజీ సాయంతో లోకేషన్ ను కనుగొన్నామని తెలిపారు.