Advertisement
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపింది ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం. దీని వేర్లు ఢిల్లీ, కేరళ వరకు ఉండడంతో సిట్ ఆచితూచి అడుగులు వేస్తోంది. కోర్టు ఆదేశాలతో అంతా సవ్యంగా జరిగేలా ప్లాన్ చేస్తోంది. నిందితులు చెప్పిన దాన్నిబట్టి ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు జగ్గుస్వామి, తుషార్, బీఎల్ సంతోష్. ఈ ముగ్గుర్ని విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు పంపారు. కానీ, ఎవరూ రాలేదు. వీరితోపాటు పంపిన న్యాయవాది శ్రీనివాస్ మాత్రం వచ్చి వివరాలు వెల్లడించారు. కానీ, ఆ ముగ్గురు హైదరాబాద్ వైపు చూడలేదు.
Advertisement
ఈక్రమంలోనే హైకోర్టును ఆశ్రయించింది సిట్. విచారణ జరిపిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. బీఎల్ సంతోష్ కు మరోసారి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. 41ఏ సీఆర్పీసీ కింద ఆయనకు మరోసారి నోటీసులు పంపాలని తెలిపింది. వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా ఈ నోటీసులు అందజేయాలని స్పష్టం చేసింది. కేసులో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం. ఈ కేసులో తదుపరి విచారణను ఈనెల 30కు హైకోర్టు వాయిదా వేసింది.
Advertisement
ఈ కేసు దర్యాప్తుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇవ్వలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. 41ఏ సీఆర్పీసీ ప్రకారం దర్యాప్తునకు సహకరించాలని బీఎల్ సంతోష్ ను కోరినట్టు చెప్పారు. కానీ, ఆయన సహకరించడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సంతోష్ ను సిట్ విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఏజీ తెలిపారు. ఏజీ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ఆయనకు మరోసారి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది.
మరోవైపు ఈ కేసును సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని బీజేపీతో పాటు నిందితులు దాఖలు చేసిన పిటిషన్ పైనా వాదనలు జరిగాయి. ఈ కేసును కేవలం రాజకీయ లబ్ధికోసమే నమోదు చేశారని.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీనికి సంబంధించి హైకోర్టు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయాన్ని తన వాదనలో వినిపించారు. 29లోపు కౌంటర్ దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్ ను ఆదేశించిన హైకోర్టు.. 30వ తేదీన విచారిస్తామని వాయిదా వేసింది.