Advertisement
ప్రధాని మోడీ చాలా రోజుల తర్వాత తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఈ టూర్ ను బాగా క్యాష్ చేసుకోవాలని బీజేపీ ప్లాన్స్ లో ఉంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం.. పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రధాని ఏం మాట్లాడతారో అనే ఉత్కంఠ నెలకొంది. పైగా టీఎస్పీఎస్సీ, పదో తరగతి పేపర్ల లీకేజ్ వ్యవహారాలపై బీజేపీ, బీఆర్ఎస్ మధ్య యుద్ధం సాగుతున్న ఈ సమయంలో మోడీ స్పీచ్ ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.
Advertisement
మొత్తం 2 గంటల పాటు మోడీ తెలంగాణలో ఉండనున్నారు. ముందుగా.. ఉదయం 11.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 11.35కు రోడ్డు మార్గంలో బేగంపేట నుంచి సికింద్రాబాద్ కు బయలుదేరతారు. ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుని.. 11.47 నుంచి 11.55 మధ్యలో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఫస్ట్ కోచ్ ను పరిశీలిస్తారు. అదే కోచ్ లో చిన్నారులతో మోడీ సరదాగా ముచ్చటించనున్నారు. 11.55 నుండి 12 గంటల మధ్యలో వందే భారత్ రైలుకు జెండా ఊపి ప్రారంభిస్తారు.
Advertisement
మధ్యాహ్నం 12.15 గంటల ప్రాంతంలో పరేడ్ మైదానానికి చేరుకుంటారు. 12.37 నుండి 12.41 మధ్యలో పలు రహదారి ప్రాజెక్టులను వేదికపై నుండే శంకుస్థాపన చేస్తారు. అనంతరం బీబీ నగర్ ఎయిమ్స్ కు శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులకు, సికింద్రాబాద్-మహబూబ్ నగర్ మధ్యలో డబులింగ్ పనులతో పాటు విద్యుత్ పనులకు, సికింద్రాబాద్-మేడ్చల్ మధ్యలో ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రారంభిస్తారు. 12.50 నుండి 1.20 గంటల ప్రాంతంలో మోడీ ప్రసంగం ఉంటుంది. 1.20 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు బయల్దేరతారు. మధ్యాహ్నం 1.30 గంటలకు విమానంలో తిరుగు పయనమవుతారు.
అయితే.. మోడీ టూర్ నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా దీటుగా బదులిచ్చేందుకు సిద్ధమయ్యాయి. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ మహాధర్నా చేయాలని ఆ ప్రాంత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, జిల్లా అధ్యక్షులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. పోస్టర్లు, బెలూన్లు ఎగురవేసి నిరసనలు తెలపాలని సూచించారు. ఇటు కాంగ్రెస్ కూడా మోడీ టూర్ ను అడ్డుకుంటామని ప్రకటించింది. అలాగే, సీనియర్ నేత భట్టి విక్రమార్క మోడీ 30 ప్రశ్నలతో లేఖాస్త్రం సంధించారు. ఈ నేపథ్యంలో మోడీ పర్యటనలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే ఉత్కంఠ నెలకొంది.