Advertisement
పాకిస్తాన్ లో ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు ఇమ్రాన్ ఖాన్. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కొన్నాళ్లుగా ఆయన పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే గత శుక్రవారం నుంచి లాంగ్ మార్చ్ ను ప్రారంభించారు. లాహార్ నుంచి ఇస్లామాబాద్ వరకూ 380 కిలోమీటర్లు ఇది సాగనుంది. మార్గమధ్యంలో పలు ర్యాలీలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే.. పంజాబ్ లోని వజీరాబాద్ లో నిర్వహించిన ర్యాలీలో తీవ్ర కలకలం రేగింది. ఇమ్రాన్ టార్గెట్ కాల్పులు జరిగాయి.
Advertisement
ఈ దాడికి సంబంధించి ఓ వ్యక్తి అరెస్టు చేయగా.. అతను చెప్పిన విషయాలు సంచలనంగా మారాయి. ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నందుకే ఇమ్రాన్ ని చంపేందుకే వచ్చానని నిందితుడు వెల్లడించాడు. లాంగ్ మార్చ్ నేపథ్యంలో ఆయన ప్రజల్ని తప్పుదోవపట్టిస్తుంటే చూస్తూ భరించలేకపోతున్నానని అందుకే చంపేందుకు ప్రయత్నించినట్టు తెలిపాడు. ఇమ్రాన్ ఖాన్ ను మాత్రమే తాను చంపాలనుకున్నానని ఇంకెవరినీ కాదన్నాడు. ఇక ఈ ఘటనలో ఇద్దరు కాల్పులు జరిపినట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో నిందితుడు స్పందిస్తూ.. తాను ఒక్కడినేనని తనతో ఇంకెవరూ లేరని సమాధానం ఇచ్చాడు.
Advertisement
ఇమ్రాన్ ఖాన్ రెండు కాళ్ళకూ గాయాలైనట్టు సమాచారం. లాహోర్ లోని ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందుతోంది. పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇమ్రాన్ కాలిలో బుల్లెట్ గాయాలైనట్టు తెలిసిందని, త్వరగా కోలుకోవాలని కోరుతున్నానని ట్వీట్ చేశారు.
కూటమిలోని భాగస్వాములు ఫిరాయింపులకు పాల్పడటంతో గత ఏప్రిల్ లో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ ఖాన్ ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలోనే అధికారం కోల్పోయారు. అయితే.. త్వరగా ఎన్నికలు జరపాలని ఆయన డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దీన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు లాంగ్ మార్చ్ కు శ్రీకారం చుట్టారు. కానీ, ఈ కార్యక్రమంలోనే ఆయనపై కాల్పులు జరపడం.. అనేక అనుమానాలకు తావిస్తోంది.