Advertisement
రాష్ట్రాన్ని కుదిపేస్తున్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రోజురోజుకు అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ పేపర్ లీక్ కేసులో ఓ లవ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముమ్మర విచారణ సాగిస్తున్న సిట్ అధికారులు ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 15 మందిని అరెస్టు చేయగా.. తాజాగా ఓ ప్రేమ జంటని అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులు ఏ ఏ పేపర్.. ఎవరెవరికి, ఎంత మొత్తానికి అమ్మారన్న విషయాలపై లోతుగా ఆరా తీస్తుండగా.. కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే.. రేణుక భర్త డాక్యా నాయక్.. ఏఈ పేపర్ ని ఏకంగా 25 లక్షలకు అమ్మినట్లు అధికారులు గుర్తించారు.
Advertisement
Advertisement
ఈ పేపర్ కొన్న వారంతా అప్పులు చేసి, ఆస్తులు కుదువ పెట్టి.. రేణుక భర్త డాక్య నాయక్, ఆమె తమ్ముడు రాజేష్ వరకు డబ్బులు ఇచ్చామని చెప్పినట్లు తెలిసింది. ఇక తాజాగా వెలుగు చూసిన లవ్ స్టోరీ లో.. ప్రియురాలి కోసం ఓ ప్రియుడు ఏకంగా ఆరు లక్షల రూపాయలు చెల్లించి డీఏవో పేపర్ ని ప్రవీణ్ దగ్గర కొనుగోలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. డిఏఓ పేపర్ కోసం సదరు లవర్ ముందుగా ఆరు లక్షల రూపాయలు చెల్లించి పేపర్ కొనుగోలు చేశాడు. ఫలితాల తర్వాత మిగతా మొత్తం ఇస్తానని వీరి మధ్య ఒప్పందం జరిగింది. అయితే ఫిబ్రవరి 28న డిఏఓ పరీక్షను టిఎస్పిఎస్సి రద్దు చేసిన విషయం తెలిసిందే.
ఈ లీకేజీ కేసులో కార్యదర్శి పీఏ ప్రవీణ్ కుమార్, సిస్టమ్ అడ్మిన్ రాజశేఖరరెడ్డి ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరిని విచారిస్తూ ఉండడంతో మొత్తం వ్యవహారం బయటకి వస్తుంది. ఇప్పటివరకు జరిగిన మొత్తం విచారణ పూర్తి చేసి సిట్ అధికారులు సీల్డ్ కవర్ లో ఈ నెల 11వ తేదీ వరకు కోర్టుకు అందజేయనున్నారు. అలాగే నిందితుల మొబైల్ ఫోన్లతో పాటు ప్రవీణ్, రాజశేఖర్ వాడుతున్న లాప్ టాప్, కంప్యూటర్ ను కూడా అధికారులు ల్యాబ్ కి పంపించారు. ఇందుకు సంబంధించిన నివేదిక రాగానే ఈ నెల 11వ తేదీన సీట్ అధికారులు దానిని కోర్టుకు సమర్పించనున్నారు. దీంతో ఈ పేపర్ లీక్ కేసు ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది.
Read also: మోసం చేసిన దర్శకుడు హరీష్ శంకర్…ఈ పోస్టర్ లో ఉన్నది పవన్ కాదు…!