Advertisement
పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. అయితే.. ఈ ఇష్యూను ప్రస్తుతానికి కాంగ్రెస్ రాజకీయంగా వాడుకుంటున్నా.. రాహుల్ కు ఊరట కలిగే అంశాలే ఎక్కువ ఉన్నాయనేది విశ్లేషకుల వాదన. తాజాగా లక్ష్యద్వీప్ నేత కేసులో జరిగినది ఉదాహరణగా చూపిస్తూ.. రాహుల్ సభ్యత్వం కూడా పునరుద్ధరణ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
Advertisement
రాహుల్ మాదిరిగానే లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ అనర్హత వేటును ఎదుర్కొన్నారు. 2009 లో కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ సలీహ్ పై దాడి చేశారన్న కేసులో ఈ ఏడాది జనవరి 10న ఆయనను కవరత్తీ సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది. పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. తీర్పు వెలువడిన మూడు రోజుల తరువాత జనవరి 13న లోక్‌సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేస్తూ ప్రకటన జారీ చేసింది.
Advertisement
ఫైజల్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. సెషన్స్ కోర్టు తీర్పు అమలును నిలిపి వేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో ఆయనపై పడిన అనర్హత వేటు చెల్లుబాటు కాకుండా పోయింది. అయినప్పటికీ సభ్యత్వాన్ని లోక్‌సభ సచివాలయం పునరుద్ధరించలేదు. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే.. విచారణకు ముందే ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించింది లోక్ సభ సచివాలయం.
ఇప్పుడు రాహుల్ గాంధీ ఇష్యూలో కాంగ్రెస్ శ్రేణులకు కొత్త ఆశగా కనిపిస్తున్నారు ఫైజల్. రాహుల్ ను పైకోర్టుకు వెళ్లమని సూరత్ కోర్టు తెలిపింది. తనపై పడిన శిక్షను సవాల్ చేస్తూ పైకోర్టుకు ఆయన వెళ్లొచ్చు. పై కోర్టులు శిక్షను ఒక్కరోజు తగ్గించినా.. సూరత్ కోర్టు తీర్పును నిలిపివేసినా.. లేదా శిక్షను పూర్తిగా రద్దు చేసినా.. ఆయనపై పడ్డ అనర్హత తొలగిపోతుంది. దీంతో లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ అవుతుంది. పై కోర్టుల్లో రాహుల్కు ఊరట లభించకపోతే మాత్రం పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ ఉండదు. కానీ, అలా జరిగే అవకాశాలు స్వల్పంగానే కనిపిస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు.