Advertisement
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తే చాలు కేఏ పాల్ సందడి మామూలుగా ఉండదు. అయితే.. ఈ మధ్య ఆయన ప్రతీ ఇష్యూపై స్పందిస్తున్నారు. వాళ్లు, వీళ్లు అని లేదు.. అందర్నీ నిలదీస్తున్నారు. కందుకూరు ఘటనపై స్పందించిన పాల్.. చంద్రబాబుపై తనదైన స్టయిల్ లో విమర్శలు గుప్పించారు. అంతేకాదు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు.
Advertisement
కందుకూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన పాల్.. ఇరుకు రోడ్డులో చంద్రబాబు సభ పెట్టారని అందుకే ఈ విషాదం నెలకొందని ఫిర్యాదు చేశారు. తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు పాల్. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల పిల్లలకు తమ ఛారిటీ ద్వారా విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రౌండ్ లో పెట్టుకోవాల్సిన సభ రోడ్డు మీదకు రావడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపించారు.
Advertisement
రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకి ఎక్కడ, ఎలాంటి మీటింగులు పెట్టాలో అర్థం కాదా అని ప్రశ్నించారు పాల్. వెంటనే నాయుడు పర్యటనలకు సంబంధించి అనుమతుల్ని రద్దు చేయాలని తానే స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి మరీ విజ్ఞప్తి చేస్తానని చెప్పారు. చంద్రబాబు సభలకు వెళ్తున్న జనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలని సూచించారు. కేవలం ఆయన కారణంగానే 8 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని విరుచుకుపడ్డారు.
నెల్లూరు జిల్లాలో మూడు రోజుల పర్యటనను చంద్రబాబు కందుకూరు నుంచి మొదలుపెట్టారు. బుధవారం సాయంత్రం కందుకూరులో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అప్పటికే వేలాదిమంది అక్కడ గుమికూడారు. నిలబడటానికి కూడా స్థలం లేనంతగా జనం కిక్కిరిశారు. ఒకరిమీద మరొకరు పడటంతో కింద ఉన్న వారు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ హఠాత్పరిమాణంతో చుట్టుపక్కల ఉన్నవారు కూడా భయాందోళనకు గురై అటూఇటూ పరుగులు తీశారు. ఇది తొక్కిసలాటకు దారి తీసింది. కొందరు పక్కనే కాలువలో పడి కొందరు ప్రాణాలు కోల్పోయారు.