Advertisement
ఈమధ్యే విక్రమ్ సినిమాతో తమిళనాట రికార్డులు క్రియేట్ చేశారు కమల్ హాసన్. చాలా ఏళ్ల తర్వాత తెలుగు వెర్షన్ లో కూడా హిట్ అందుకున్నారు. ఇండియన్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్న కమల్.. బుధవారం హైదరాబాద్ వచ్చారు. తన గురువు కళాతపస్వి కే విశ్వనాథ్ ని కలిశారు. కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విశ్వనాథ్ నుంచి ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుండి మళ్లీ చెన్నైకి వెళ్లారు.
Advertisement
హైదరాబాద్ నుంచి బయలుదేరిన ప్రయాణ సమయంలో కొంత అస్వస్థతకి గురయ్యారు కమల్. తర్వాత పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఆసుపత్రికి వెళ్లారు. తీవ్రమైన జ్వరం, దగ్గుతో బాధపడుతూ.. చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ హాస్పిటల్ లో చేరారు. డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే.. తమ అభిమాన నటుడికి ఏమైందో అని ఫ్యాన్స్ తెగ కంగారు పడుతున్నారు. ఆలయాల్లో కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Advertisement
ఈక్రమంలోనే కమల్ ఆరోగ్య పరిస్థితిపై హాస్పిటల్ డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. క్రమంగా కోలుకుంటున్నారని చెప్పారు. కమల్ ఆరోగ్య పరిస్థితి కుదుటపడ్డాక రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు తెలిపారు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
కమల్ ఆసుపత్రిపాలవడంతో తమిళ బిగ్ బాస్ షోపై తీవ్ర ప్రభావం పడుతుందని అంటున్నారు. వీకెండ్ ఎపిసోడ్లపై నీలినీడలు కమ్ముకున్నాయి. తమిళ బిగ్ బాస్ షో కు యాంకర్ గా కమల్ వ్యవహరిస్తున్నారు. శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ఎపిసోడ్లలో ఆయన స్టేజ్ పై అలరించాల్సి ఉంది. కానీ, అనారోగ్య కారణాల దృష్ట్యా ఆ ఎపిసోడ్లు చేస్తారో లేక వేరే యాక్టర్స్ తో కవర్ చేస్తారో అనే ఉత్కంఠ నెలకొంది.