Advertisement
లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ నోటీసులు పంపడంతో తెలంగాణలో ఒక్కసారిగా అంతా మారిపోయింది. ప్రగతి భవన్ సందడిగా మారగా.. పార్టీలు మాటల తూటాలు పేలుస్తున్నాయి. సీఎం కేసీఆర్ సడెన్ గా కేబినెట్ భేటీకి పిలుపునిచ్చారు. పైకి ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చించేందుకే అని చెబుతున్నా.. కవిత అరెస్ట్ అయితే.. చేయాల్సిన కార్యక్రమాలపైనే ప్రధానంగా చర్చ ఉంటుందని అంతా అనుకుంటున్నారు.
Advertisement
ఢిల్లీ వెళ్లే ముందు ఎమ్మెల్సీ కవితతో సీఎం కేసీఆర్ ఫోన్ లో మాట్లాడారు. జంతర్ మంతర్ కార్యక్రమాన్ని కొనసాగించాలని, ఆందోళన పడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. దీంతో ధైర్యంగా ఆమె ఢిల్లీ వెళ్లారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే కేబినెట్ భేటీ అనే విషయం బయటకొచ్చింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను విచారణకు పిలిచి.. తర్వాత అరెస్ట్ చేయడంతో కవితను కూడా అరెస్ట్ చేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది.
Advertisement
మరోవైపు ఈనెల 10న బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంతో పాటు పార్లమెంటరీ, లెజిస్టేటివ్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అధ్యక్షతన ఈ మీటింగ్స్ జరగనున్నాయి. ఈ సమావేశాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆహ్వానం పంపారు. అలాగే, రాష్ట్ర కార్యవర్గం, జడ్పీ, కార్పొరేషన్ల ఛైర్మన్లు హాజరు కానున్నారు.
ఎన్నికల వేళ బీఆర్ఎస్ కార్యాచరణపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని అంటున్నారు పార్టీ నేతలు. అయితే.. కవితను అరెస్ట్ చేస్తే.. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించేలా పలు సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.